ఇగో, ఇక్కడే
రెండు ట్రాక్టర్ల ఇసుక కుప్ప ఉండేది
పొద్దంతా ఇసుక జల్లెడ పట్టి
చినిగిన ఇనుప జాలి అయ్యేది అమ్మ
నాయినేమో, మేస్త్రీ కింద పార పని చేసి
నెత్తికే అంటుకపోయిన
సుట్టుబట్టలాగా కన్పించేటోడు
ఎక్కడ చూసినా
సీకులు, సిమెంటు దుమ్ము
ఇటుకపెల్లలు, దొడ్డిసుక
చిన్న కంకర రాయి పక్కకు జరిగినా
కుప్పనూకి రాశి పోసేది అమ్మ
బడికెళ్ళి వచ్చినంక
నాకూ, చెల్లెకు గోడకు నీళ్లు తాపే డ్యూటీ
బోరింగు కొట్టి
చెల్లెలు డమ్ముల నీళ్ళు నింపుతుంటే
ఇటుకగోడల మీదంగ నేను
సన్నటి నీటిధారనౌదు
ఎప్పుడైన ఈ మిద్దె ఎక్కినప్పుడు
నాయిన ఇక్కడే ఎక్కడో నిలబడి
నీళ్ళు మంచిగ పోయమని కోపం చేస్తున్నట్టు
గోడలు ఎన్ని నీళ్ళు తాగితే
అంత బలంగా ఉంటాయని చెబుతున్నట్టు ఉంటది
ఈ మల్లెచెట్టు ఉన్న తావునే
చిన్న కంకరరాళ్ళ కుప్ప ఉండేది
అలిసిపోయి దీని మీదనే
బొంతేసుకొని ఒరిగేది నాయిన
సారసుక్క తాగి పాటందుంకుంటే
సందమామ కదలక మెదలక నిలబడేది
ఈ సబ్జలు చూసినవా
ఇక్కడి దాక వచ్చి ఇల్లు ఆగినపుడు
ఎందరి కాళ్ళో పట్టుకుండంట నాయిన.
పైసల చెట్టు కాయలేదన్న సుట్టమేగాని
ఒక పునాదిరాయి అయినవారు లేరు
అమ్మ , నేను కూర్చున్నప్పుడు
ఎప్పుడూ ఇదే జోలి ఎల్లబెడుతుంటది
గవర్నమెంటు ఇచ్చిన సీకులు, సిమెంటు
మధ్యన ఎవరి చేతిలో మాయమైనవో
రెండు దోసిళ్ళ మన్నువోసి సాపిస్తుంటే
ద్ణుఖంతో, కోపంతో
గుండెకుండలో రక్తం సలసల మరిగేది.
ఈ కిచెన్ రూం కన్పిస్తుందా?
ఇంతకు ముందు ఇక్కడే
ఎర్రమన్ను అరుగు మీద
రెండు లబ్బరు బిందలు
పక్కనే ఒక ఇత్తడి బింద
చీమలు పడుతవని బువ్వకుండ
ఉట్టి మీద కూసోని ఉయ్యాలూగేది
ఈ దొండపాదు ఉంది చూడూ
ఇక్కడ్నే పెద్ద కంప చెట్టు
దీన్ని ఆనుకొని తాటికమ్మల గుడిసె
ఇంత ఈ చిన్న గుడిసెలో
నలుగురం ఎట్ల పట్టినమో తెల్వదు.
వానకు ఈ గుడిసె కూలిపోతదని
బట్టల మూటలను, గిన్నెలు గిలాసలను
దబదబ సర్దుకోవడమే ఇండ్లకు వచ్చినట్టు
ఇంత కష్టపడి కట్టుకున్న ఈ ఇంట్లో
యేడాదన్నా సుఖపడలే నాయిన
మా కెవ్వరికి చెప్పకుండా
చెలుకలో ఇల్లు కట్టుకుండు.
ఈ జాజుపూతల తలుపు రెక్కల్ని
ఒక సారి పట్టుకొని చూడు-
నాయిన సచ్చిపోయినంక
గవర్నమెంటు పైసలొస్తే
గుర్తుగా ఈ తలుపులు చేపిచ్చినము!
- తగుళ్ళ గోపాల్
95050 56316










