Jul 14,2023 13:02

జపాన్‌ : జపాన్‌ తలపెట్టిన అంతరిక్ష కార్యక్రమానికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ దేశం అభివృద్ధి చేస్తున్న ఘన ఇంధన రాకెట్‌ ఇంజిన్‌ పరీక్షల సమయంలోనే పేలిపోయింది. ఈ ప్రమాదం శుక్రవారం చోటు చేసుకొన్నట్టు ఆ దేశ స్పేస్‌ ఏజెన్సీ వెల్లడించింది. గతంలో ఉపయోగించిన ఎప్సిలాన్‌ రాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఎప్సిలాన్‌-ఎస్‌( Epsilon S)  పేరిట సిద్ధం చేసింది. ఇపుడు అది కూడా ప్రమాదానికి గురైనట్టు స్పేస్‌ ఏజెన్సీ వెల్లడించింది. గత అక్టోబర్‌లో ఘన ఇంధనం ఆధారంగా పనిచేసే ఎప్సిలాన్‌ను ప్రయోగించింది. అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది. ఇపుడు మార్పులతో పరీక్షించగా.. ప్రయోగం మొదలైన 50 సెకన్లలోనే విఫలమై పేలిపోయింది. ఉత్తర అకితా ప్రాంతంలో ఈ ప్రయోగం జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో భారీ ఎత్తున మంటలు, పొగలతో నిండిపోయింది. దీనికి సంబంధించిన చిత్రాలను జాతీయ మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే ప్రసారం చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టంపై సమాచారం అందలేదని జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీ (జేఏఎక్స్‌ఏ) అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు.