
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన నేత పోతిన మహేష్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. స్వాతి సెంటర్లో ఆదివారం వైఎస్ విగ్రహావిష్కరణ జరిగింది. స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు అనుమతి ఇవ్వని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ విగ్రహాలకు ఎలా అనుమతిస్తుందంటూ నిరసన వ్యక్తం చేశారు. వీఎంసీ కమిషనర్ వైసీపీ నగర అధ్యక్షుడులా వ్యవహరిస్తున్నారు అని జనసేన నేత పోతిన వెంకట మహేష్ మండిపడ్డాడు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అవినీతిని ఆధారాలతో సహా త్వరలో బయటపెడతా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అంటే వైసీపీ నేతలకు వణుకు పుడుతుంది అని ఆయన విమర్శలు గుప్పించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కి మమ్మల్ని చూస్తే చలి జ్వరం వస్తుంది అని పోతిన మహేశ్ అన్నారు. మహనీయుల విగ్రహాలు పెట్టాలని ప్రయత్నిస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అడ్డుకుంది అని జనసేన నేత పోతిన మహేశ్ అన్నారు. వైఎస్‌ఆర్ విగ్రహాలకు నిబంధనలు అడ్డు రావా?.. అని ఆయన ప్రశ్నించారు. దీనిపై త్వరలో ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తాను.. వైసీపీ నేతలు వైఎస్సార్ పై ప్రేమతో కాకుండా చందాల వసూలు చేసుకోవటానికే విగ్రహాలు పెడుతున్నారు అంటూ పోతిన మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.