Oct 19,2023 15:34

కాకినాడ: ఐబీ సిలబస్‌ వల్ల పేద విద్యార్థులకు ఏం ప్రయోజనమో ముఖ్యమంత్రి జగన్‌ తెలపాలని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. తన స్వలాభం కోసం విద్యా శాఖను అక్రమాలకు అడ్డాగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ - ఐబీ (ఇంటర్నేషనల్‌ బెకాలారెట్‌) సిలబస్‌ను పాఠశాలల్లో ప్రవేశ పెట్టేందుకు చేసుకుంటున్న ఒప్పందం వైసిపి ప్రభుత్వ అవినీతికి నిదర్శనమన్నారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడారు. ''పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు మొన్నటి వరకు ఆంగ్ల మాధ్యమం అని, ఆ తర్వాత సీబీఎస్‌ఈ సిలబస్‌ అని మాయ మాటలు చెప్పిన సీఎం.. తాజాగా ఐబీ సిలబస్‌ను బలవంతంగా విద్యార్థులపై రుద్దేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ ఐబీ కరికులమ్‌ ప్రపంచంలో కేవలం 4 వేల పాఠశాలల్లో మాత్రమే అమలవుతున్న విధానం. దేశం మొత్తం మీద కేవలం 212 పాఠశాలల్లో మాత్రమే ఐబీ సిలబస్‌ అమలవుతోంది. అలాంటి సిలబస్‌ను రాష్ట్రంలోని 40వేలకు పైగా ప్రభుత్వ స్కూల్స్‌ లో అమలు చేయడం ఏంటి? అన్ని పాఠశాల్లలో ఈ సిలబస్‌ను అమలు చేయడానికి ఎందుకంత తొందరపడుతున్నారో ప్రజలకు వివరించాలి. విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి వైసిపి ప్రభుత్వం ప్రణాళిక వేస్తున్నట్లు కనిపిస్తోంది'' అని నాదెండ్ల విమర్శించారు.