
- ఐదు రాజ్యాంగ సవరణలు చేయాలి
- వేల కోట్లు ఖర్చు చేయాలి
- భారీగా ఈవిఎం, వివిప్యాట్‌లు అవసరం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత కొద్ది కాలంగా జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా రకరకాలైన చర్చలు, ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో రాజ్యసభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికలు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం కష్టమని అన్నారు. ''ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అంత ఈజీ కాదు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ అందుకు అనేక కీలక అవరోధాలు, అడ్డంకులు కూడా ఉన్నాయి. కనీసం ఐదు కీలక రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో పార్లమెంట్ ఉభయ సభల వ్యవధికి సంబంధించిన ఆర్టికల్ 83, లోక్‌సభ రద్దు చేయడానికి రాష్ట్రపతికి ఉన్న అధికారాలకు సంబంధించిన ఆర్టికల్ 85, రాష్ట్ర శాసన సభల కాల వ్యవధికి సంబంధించిన ఆర్టికల్ 172, రాష్ట్రాల శాసన సభలు రద్దు సంబంధించిన ఆర్టికల్ 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించిన ఆర్టికల్ 356ను సవరించాల్సి ఉంది. అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని పొందడం. పాలనా వ్యవస్థలో ముఖ్యమైన సమాఖ్య నిర్మాణానికి సంబంధించి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయం కూడా పొందడం అత్యవసరం. పెద్ద ఎత్తున అదనపు ఈవిఎంలు, వివిప్యాట్ యంత్రాలు అవసరం. అందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. అయితే ఆ ఈవిఎంలు, వివిప్యాట్ యంత్రాలు 15 ఏళ్ల కంటే ఎక్కువ పనిచేయవు. ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్దఎత్తున డబ్చు ఖర్చు చేయాలి. అంతా భారీ స్థాయిలో ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఈవిఎం, వివిప్యాట్ యంత్రాలను కేవలం మూడు, నాలుగు సార్లు మాత్రమే ఉపయోగించగలం. అదనంగా పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం'' అని తెలిపారు. ''ఒకేసారి ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కేంద్ర సిబ్బంది, న్యాయ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలన చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సహా సంబంధిత భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపింది. తదుపరి రోడ్ మ్యాప్ రూపకల్పనకై ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉంది'' అని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు.