
- కర్ణాటక పరాభవం పునరావృతం అవుతుందని బిజెపి భయపడుతోందా ?
- అవుననే అంటున్న విశ్లేషకులు
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రతిపక్షాలను సంప్రదించడం పరిపాటి. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో అందుకు భిన్నమైన వాతావరణం కన్పిస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సందర్భంలోనూ ప్రతిపక్షాలతో చర్చించిన పాపాన పోలేదు. జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏ సంప్రదింపులూ లేకుండా ఏకపక్షంగా ప్రకటించిన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో ఇండియా కూటమి తరఫున ఒకే ఒక సభ్యుడు అధిర్ రంజన్ చౌదరికి అవకాశం లభించింది. అయితే ఈ కమిటీలో... తాను చేరబోనని చౌదరి స్పష్టం చేయడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే కమిటీ ఏర్పాటు కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే. జమిలి ఎన్నికలపై ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో కమిటీ చేసే సిఫార్సులకు, అందులోని సభ్యుల అభిప్రాయాలకు విలువ ఏముంటుంది ?
లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రయోజనాలు, లాభాల మాట అటుంచితే లోక్‌సభకు, శాసనసభలకు విడివిడిగా ఎన్నికలు జరిపితే తనకు రాజకీయంగా నష్టం కలుగుతుందేమోనని బీజేపీ అనుమానిస్తోంది. కర్నాటకలో ఎదురైన పరాభవమే ఈ సంవత్సరం చివరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని శాసనసభలకు జరిగే ఎన్నికలలో కూడా పునరావృతమవుతుందేమోనని కమలనాథులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఒకే రాయి విసిరి రెండు పక్షులను నేలకూల్చాలని మోడీ నిర్ణయించారు. ఆ క్రమంలోనే శాసనసభ ఎన్నికలను నివారించి వాటిని లోక్‌సభ ఎన్నికలతో పాటే జరపాలని భావిస్తున్నారు. పైగా జీ-20 దేశాల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించబోతున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి ఎదురైతే ప్రపంచ దేశాల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మోడీ భయపడుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష 'ఇండియా' కూటమి రోజురోజుకూ సంఘటితమవుతోంది. విస్తృతం కూడా అవుతోంది. తాజాగా ముంబయిలో జరిగిన సమావేశాల్లో ఇది మరింత స్పష్టమైంది. ప్రజల్లో సైతం 'ఇండియా' కూటమికి మిగతా 5లో సానుకూలత, ఆదరణ పెరుగుతోంది. బిజెపికి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని ముంబయిలో జరిగిన సమావేశంలో కూటమి నిర్ణయించింది. ఇది అధికారపక్షానికి గుబులు పుట్టిస్తోంది. అయితే ఏ పార్టీ పోటీ చేయాలి, ఏ ప్రాతిపదికన అభ్యర్థిని నిలపాలి అనే విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశాలపై సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకోవటానికి ఇంకా సమయం పడుతుంది. ఈ సమయంలో ప్రతిపక్షాలకు ఇవ్వకూడదనేది బిజెపి ఎత్తుగడగా తెలుస్తోంది.