
- ఉన్నతస్థాయి కమిటీకి లా కమిటీ సమర్పణ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జమిలి ఎన్నికల ప్రతిపాదనను పరిశీలిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్యానెల్‌కు రాజ్యాంగంలో అవసరమైన మార్పులతో సహా రోడ్‌మ్యాప్‌ను లా కమిషన్ సమర్పించింది. ఈ ప్రతిపాదన 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మాత్రమే కార్యరూపం దాల్చగలదని, కాలక్రమేణా, అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలను సమకాలీకరించడానికి అసెంబ్లీల పదవీకాలాన్ని పొడిగించడం లేదా తగ్గించడానికి ఒక ఫార్ములాను రూపొందిస్తుందని కమిషన్ పేర్కొంది. దీనికి సంబంధించి లా కమిషన్ నుండి నివేదిక ఇంకా పెండింగ్‌లో ఉంది. రామ్‌నాథ్ కోవింద్ ప్యానెల్ తో మరో రౌండ్ చర్చల కోసం లా కమిషన్‌ను మళ్లీ ఆహ్వానించనున్నారు.
జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన 'హై లెవెల్ కమిటీ ఆన్ వన్ నేషన్, వన్ ఎలక్షన్' ప్యానెల్ సభ్యులతో లా కమిషన్ చైర్‌పర్సన్ రిటైర్డ్ జస్టిస్ రితురాజ్ అవస్థీ భేటీ అయ్యారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వం వహిస్తున్న ఈ కమిటీ రెండో సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జమిలి ఎన్నికల నిర్వహణపై తమ ఉద్దేశాన్ని తెలపాల్సిందిగా లా కమిషన్ చైర్‌పర్సన్‌ను కోవింద్ ప్యానెల్ ఆహ్వానించింది. జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన రాజ్యాంగ సవరణలు, రోడ్ మ్యాప్ తయారీ తదితర అంశాల గురించి జస్టిస్ రితురాజ్, ప్యానెల్ సభ్యులతో చర్చించారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే ప్రతిపాదనను లా కమిషన్ పరిశీలిస్తుండగా, మాజీ రాష్ట్రపతి నేతృత్వంలోని ప్యానెల్ అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి మార్గాలను అన్వేషిస్తోంది. కోవింద్ ప్యానెల్ పేరును అధికారికంగా ఒక దేశం, ఒకే ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ (హెచ్‌ఎల్‌సి)గా మార్చినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ విడుదల చేసింది.
ఈ విషయంపై తమ అభిప్రాయాలను సేకరించేందుకు హెచ్‌ఎల్‌సి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది. ఇప్పటి వరకు ఆరు జాతీయ పార్టీలు, 33 రాష్ట్ర పార్టీలు, ఏడు నమోదై- గుర్తింపు లేని పార్టీలకు లేఖలు పంపారు. ఇటీవలి జరిగిన సమావేశంలో కమిటీ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి రాజీనామా చేయడాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్.కె. సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి. కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజరు కొఠారి పాల్గొన్నారు.
రామ్‌నాథ్ కోవింద్ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తూ సెప్టెంబర్ 2న విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌లో తరచుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల భారీ వ్యయం, ఎన్నికల కోసం అధికారిక యంత్రాంగాన్ని మళ్లించడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా అభివృద్ధి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఏకకాలంలో ఎన్నికలు జరిగితే మూడింటికి అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే ప్రభుత్వ ప్రతిపాదనపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాతో పాటు చాలా మంది మేథావులు వ్యతిరేస్తున్నారు.