ప్రజాశక్తి -కారంచేడు(బాపట్ల) : మండలంలోని తిమిడితపాడు, ఆదిపూడి గ్రామాలలో జగనన్న సురక్ష మొదటి రోజు కార్యక్రమం శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిపూడిలో పర్చూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి మదన్ మోహన్ శెట్టి, కారంచేడు తహశీల్దార్ ఎస్.వెంకటరత్నం పాల్గొనగా తిమిడితపాడులో ఎంపీడీవో విజయలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. ఈ రెండు గ్రామాల్లో స్థానిక వైసీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ హాజరై ప్రజలు పెట్టుకున్న అర్జీలకు అర్జీదారులకు అనుమతి పత్రాలను అందజేశారు. అయితే ఈ కార్యక్రమంలో అర్జీదారులకు తక్షణం అధికారుల నుండి కుల ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లాంటివి మాత్రమే అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలకు ప్రజలు నూరు శాతం సంతోషంగా ఉండాలని లక్ష్యంతో ప్రతి గ్రామం సర్వే చేసి పథకాలకు అవసరమైనటువంటి వివిధ రకాల అర్జీలను పరిశీలించి ప్రజలకు అందజేస్తామని అధికారులు తెలిపారు. మిగిలిన మరికొన్ని అర్జీలను పరిశీలించి వీలైనంత త్వరగా ఆయా సర్టిఫికెట్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీరుకట్టు వాసు బాబు, స్థానిక పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు స్థానిక వైసిపి నాయకులు దండా చౌదరి బాబు, ఎర్రం లక్ష్మారెడ్డి, జగనన్న సురక్ష కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.










