Mar 21,2023 21:30

-పార్లమెంటు ఆవరణలో ఆందోళన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడైన అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్‌ అదానీ అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) నియమించాల్సిందేనని ప్రతిపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు మరోమారు పునరుద్ఘాటించారు. అదానీ అక్రమాలకు పాల్పడిన వైనాన్ని హిండెన్‌బర్గ్‌ సంస్థ బట్టబయలు చేయడం, అనంతరం రూ.లక్షల కోట్ల మదుపర్ల సొమ్ము ఆవిరైపోయినా ప్రధాని మోడీ నోరు మెదపడం లేదని విమర్శించారు. బిజెపి ప్రభుత్వానికి, అదానీకి వ్యతిరేకంగా పార్లమెంటులోనూ, వెలుపలా ప్రతిపక్ష సభ్యుల నినాదాలు మార్మోగాయి.
పార్లమెంటులో మొదటి అంతస్థులో ఉన్న ఎస్‌బిఐ బ్రాంచ్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన ప్రతిపక్షాల ఎంపిలు ఒక్క అదానీకే రూ.వేలాది కోట్ల మొత్తాన్ని రుణాలుగా ఎలా ఇచ్చారంటూ నిలదీశారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత తీవ్ర ప్రభావానికి గురైన విత్త సంస్థల్లో ఎస్‌బిఐ ఒక్కటి. బిజెపి ప్రభుత్వ ఒత్తిళ్లతోనే విత్త సంస్థలు నుంచి అధిక మొత్తంలో అదానీకి రుణాలు మంజూరయ్యాయని విమర్శించారు. అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకున్న ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చడానికి 'జెపిసి వేయాల్సిందే'నని నినాదాలతో హోరెత్తించారు. ప్రధానంగా అదానీ గ్రూప్‌ స్టాక్‌ మేనిప్యులేషన్‌, ఆర్థిక మోసాలు వంటి అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపైనా సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. అదానీ ప్రస్తావన రాగానే ప్రధాని మోడీ చర్చ నుంచి పారిపోతున్నారని ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 'అదానీ బాగోతంపై పార్లమెంటులో చర్చ జరగనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా' అని ఆయన ప్రశ్నించారు.
కొనసాగిన ప్రతిష్టంభన
అదానీ వివాదంపై జెపిసి దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు, లండన్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని బిజెపి సభ్యులు పరస్పర ఆందోళనలతో పార్లమెంట్‌ మంగళవారం కూడా స్థంభించిపోయింది. లోక్‌సభ ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో మధ్యాహ్నం రెండు గంటల వరకు సభ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలోనూ ఆందోళన కొనసాగింది. గందరగోళం మధ్యే ఒకే ఒక్క నిమిషంలో మూజువాణి ఓటుతో జమ్మూకాశ్మీర్‌ బడ్జెట్‌ను ఆమోదించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.1.118 లక్షల కోట్లతో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రతిపాదించారు. ఆ వెంటనే సభ గురువారానికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అదానీ-హిండెన్‌బర్గ్‌ సమస్యపై చర్చను రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ తిరస్కరించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఫలితంగా మధ్యాహ్నం రెండు గంటల వరకు రాజ్యసభ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలోనూ అదే పరిస్థితి కొనసాగడంతో సభ గురువారానికి వాయిదా పడింది.