Jul 29,2023 07:02

మహిళలకు రక్షణ కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సాగుతున్న చారిత్రాత్మక ప్రచార యాత్రకు జేజేలు.
స్వతంత్ర భారతంలో జాతికి జన్మనిచ్చిన స్త్రీలపై, బిడ్డలపై సాగే భయంకర హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని, పాలక వర్గాలను కోరుతూ జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త ప్రచారయాత్ర ప్రభుత్వాలకు హెచ్చరిక వంటిది.
భారత స్త్రీ మార్కెట్‌ సరుకుగా చీకటి బజారులో అమ్మబడుతున్న రాక్షస వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతున్నది. ప్రభుత్వ రక్షక యంత్రాంగం, అధికారులు తమ బాధ్యతలన్నింటిలోనూ మహిళల, బిడ్డల రక్షణ ప్రధానమైనదిగా నిరంతరం పనిచేయాలి. రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతిని, అత్యాచారాలను, దోపిడీ శుక్తులను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.
అభ్యుదయవాదులు, సమాజ సంక్షేమం కోరే పెద్దలు, కార్యకర్తలు మహిళా ఉద్యమానికి మరింత వెన్నుదన్నుగా నిలవాలి. మహిళా ఉద్యమ అభివృద్ధికి సహాయం అందించాలి.
రాష్ట్ర వ్యాపితంగా కురుస్తున్న కుండపోత వర్షాలలో పిల్లలను, సంసారాలను వదలి...అత్యంత చైతన్య యుతంగా పోరు యాత్రలో పాల్గొంటున్న...మహిళలు, ఉద్యమ కార్యకర్తలకు జేజేలు. రాష్ట్ర మహిళా సంఘం సాహసంతో చేపట్టిన ఈ ప్రచార యాత్ర జయప్రదంగా సాగాలని కోరుకుంటూ రథసారథులకు అభినందనలతో...
 

- అల్లూరి మన్మోహిని