Jul 28,2023 12:22
  • మద్యం మత్తు పదార్థాలను  నియంత్రించాలి

ప్రజాశక్తి-కలెక్టరేట్ : మహిళలపై హింస నివారణకు నిపుణులతో అధ్యయన కమిషన్ ఏర్పాటు చేయాలని, మద్యం మత్తు పదార్థాలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో హింసపై మహిళల పోరుయాత్ర రాష్ట్ర జాతా విశాఖపట్నంలో శుక్రవారం ఎల్ఐసి దరి అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైంది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్షురాలు బి.పద్మ అధ్యక్షత వహించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ హింసను అరికట్టడానికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని, మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా  త్వరితగతిన విచారణ జరిపి, నిందితులకు కఠినమైన శిక్షలు విధించాలన్నారు. ఫోర్న్ వెబ్ సైటును  నిషేదించాలన్నారు. ప్రభుత్వం మీడియా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. హింస, అశ్లీలత అసమానతలను ప్రేరేపించే చలన చిత్రాలు, టీవీ సీరియల్స్, ఇంటర్నెట్ కార్యక్రమాలను నిషేదించాలన్నారు. కాలేజీల్లో, పని ప్రదేశాల్లో వేధింపుల నిరోధక అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేసి అమలు చేయాలన్నారు. మద్యం మత్తు పదార్థాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని, డి.ఎడిక్షన్ సెంటర్లను విస్తృత పరిచి పటిష్టంగా పనిచేయించాలన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మహిళలపై హింస రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మల్లయోధులు చేసిన ఆందోళన ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. లేటెస్ట్ గా  ఇటీవల మణిపూర్ లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం చాలా దారుణమైన సంఘటన అన్నారు. దీనిపై దేశం మొత్తం యావత్తు కేంద్రలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిరసనలు తెలియజేసినా, దున్నపోతు మీద వర్షం కురుసిన చందంగా కనీసం మాట్లాడలేదని విమర్శించారు. మహిళలు, చిన్నారులు పెరుగుతున్న హింసను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆరోపించారు.

aidwa-poru-yatra-start-in-visakha