Aug 28,2023 09:37

ప్రజాశక్తి- గుడివాడ : దేశ భవిష్యత్తును కాపాడుకోవాలంటే బిజెపిని గద్దె దించాల్సిన అవసరం ఉందని సిఐటియు అఖిల భారత అధ్యక్షులు డాక్టర్‌ కె హేమలత అన్నారు. శ్రామిక మహిళ 9వ రాష్ట్ర సదస్సు గుడివాడలోని కామ్రేడ్‌ రంజన నిరూల నగర్‌ (కమ్మవారి సత్రం)లో ఆదివారం జరిగింది. ముందుగా సిఐటియు జెండాను హేమలత ఎగురవేశారు. అనంతరం జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగాన్ని మార్చి రాయాలనే ఆలోచనతో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపిని గద్దె దించితేనే దేశం బాగుపడుతుందని, మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే మనం సాధించుకున్నవన్నీ కోల్పోతామని అన్నారు.
           ఇప్పటికే సామాన్యులకు అందుబాటులో లేకుండా ధరలు పెంచడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు, రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ లైంగిక వేధింపుల చట్టం ఉన్నా అమలు కావడం లేదన్నారు. అసంఘటిత రంగంలో కూడా ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేసి అవి పనిచేసేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాక్టరీల్లో లైంగిక వేధింపులు విపరీతంగా పెరుగుతున్నాయని, లైంగిక వేధింపులు చేసిన వారిని వదిలి వేధింపులపై ఫిర్యాదు చేసిన వారిని దోషులుగా చేస్తున్నారని అన్నారు.

                                                                    పలు తీర్మానాలు ఆమోదం

అధిక ధరలు తగ్గించాలని, నిత్యావసర సరుకులను చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేయాలని, కేరళ తరహాలో చౌకదుకాణాల ద్వారా 16 రకాల సరుకులు అందించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రెగ్యులరైజ్‌ చేయాలని, శ్రామిక మహిళల సమస్యలు పరిష్కరించాలని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం పటిష్టంగా అమలు చేయాలని, బాలికలు, మహిళలపై హింసను అరికట్టాలని, హింసలేని సమాజం కోసం పోరాడాలని సదస్సులో తీర్మానించారు. సదస్సులో నివేదికను కె.ధనలక్ష్మి, సంతాప తీర్మానాన్ని కె.నాగమణి ప్రవేశపెట్టారు.
         కామేశ్వరి, ధనశ్రీ, నిర్మలమ్మ, వరలక్ష్మి అధ్యక్షవర్గంగా, సిఐటియు ఆఫీస్‌ బేరర్స్‌ జి.బేబీరాణి, సుబ్బారావమ్మ, డి రమాదేవి, కె.ధనలక్ష్మి స్టీరింగ్‌ కమిటీగా వ్యవహరించారు. ఈ సదస్సుకు ఎల్‌ఐసి వర్కింగ్‌ ఉమెన్స్‌ స్టేట్‌ కన్వీనర్‌ సూర్యప్రభ, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు వరలక్ష్మి, రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి 24 రంగాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. 23 జిల్లాల నుండి 16 రంగాల నుంచి చర్చల్లో పాల్గొన్నారు.