Sep 16,2023 22:17

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. జిల్లాలోని యురి ప్రాంతంలో హత్లాంగా వద్ద నియంత్రణ రేఖ వెంబడి శనివారం తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను గుర్తించిన భారత సైన్యం అప్రమత్తమై కాల్పులు ప్రారంభించగా, ఉగ్రవాదులతో పాటు సమీపంలోని పాకిస్థాన్‌ సైనిక పోస్టు నుంచి కూడా ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. భారత సైన్యం కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందగా, వారిలో ఇద్దరి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకాశ్మీర్‌లో ఈ వారంలో ఇది మూడో ఎన్‌కౌంటర్‌. కొన్ని రోజుల క్రితం రాజౌరి, అనంతనాగ్‌ జిల్లాల్లో ఎన్‌కౌంటర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఎన్‌కౌంటర్లలోనూ నలుగురు భద్రతా సిబ్బంది, ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. అనంతనాగ్‌ జిల్లాలో నాలుగోరోజైన శనివారం కూడా కాల్పులు కొనసాగాయి.