Oct 28,2023 21:05

ఏడాదిలో 85 శాతం పతనం
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు కోలుకోని సూచీ
ముంబయి : బిలియనీర్‌ గౌతం అదానికి చెందిన అదాని టోటల్‌ గ్యాస్‌ షేర్‌ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మూటగడుతోంది. ఏడాది కాలంలో దాదాపుగా 85 శాతం పతనమయ్యింది. అదాని ఆర్థిక మోసాలపై ప్రస్తుత ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన రిపోర్ట్‌ దెబ్బకు ఆ సూచీ వరుసగా కుప్పకూలుతోంది. జనవరిలో దాదాపుగా రూ.4,000కు చేరవకు వెళ్లిన.. ఈ సూచీ అక్టోబర్‌ 27 నాడు 562.70 వద్ద ముగిసింది. అదాని కంపెనీల షేర్ల ధరలను ప్రమోటర్లు కృత్రిమంగా పెంచారని హిండెన్‌బర్గ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. కార్పొరేట్‌ మోసాలకు పాల్పడిన ఆ కంపెనీ ఆ స్టాక్స్‌ దాదాపు 85 శాతం పతనం కావొచ్చని హిండెన్‌బర్గ్‌ అప్పుడే హెచ్చరించింది. ఆ విధంగానే అదాని టోటల్‌ గ్యాస్‌ స్టాక్‌ పతనాన్ని చవి చూడటం విశేషం.
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ దాదాపు రూ.10 లక్షల కోట్లకుపైగా ఆవిరయ్యింది. ఆ తర్వాత అదాని కంపెనీల్లో మరో యుఎస్‌ ఫండ్‌ జిక్యుజి పార్టనర్స్‌ పెట్టుబడులతో కొంతమేరకు షేర్లు కోలుకున్నప్పటికీ.. తిరిగి మళ్లీ ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి. 2023 జనవరి 24న ఈ షేరు ధర రూ.3,892. దీంతో పోలిస్తే కేవలం తొమ్మిది నెలల్లో అదానీ టోటల్‌ ధర 85 శాతం పతనాన్ని చవి చూసింది. అదాని గ్రూపులో 10 లిస్టెడ్‌ కంపెనీలు ఉన్నాయి. అందులో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ విల్మార్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, అదానీ పవర్‌, ఎసిసి, అంబూజా సిమెంట్స్‌, ఎన్‌డిటివి తదితర సంస్థలున్నాయి. ఎన్‌డిటివిని ఇటీవలే కొనుగోలు చేసింది. మిగిలిన తొమ్మిది గ్రూప్‌ కంపెనీల్లో అదానీ పోర్ట్స్‌ మినహా మిగిలిన షేర్లన్నీ జనవరిలోని ధరలతో పోలిస్తే ప్రస్తుతం 20 నుంచి 70 శాతం నష్టాల్లో ట్రేడింగ్‌ అవుతున్నాయి.