Feb 17,2023 21:30

న్యూఢిల్లీ : అదాని నౌకాశ్రయాల్లో ఎలాంటి ఒప్పందాలు లేకుండానే దిగుమతుల వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఎలాంటి టెండర్‌ లేకుండానే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఒసి) గంగవరం పోర్టు ద్వారా దిగుమతులు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. టెండర్‌ ప్రక్రియ లేకుండానే ఈ వ్యవహారం జరుగుతుందని తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపి మహు మెయిత్రా ఆరోపించారు. ఎలాంటి సిగ్గు లేకుండా అదాని కంపెనీలు ఇలాంటి దొంగ చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ''టెండర్‌ లేదు, సివిసి విదివిధానాలు లేవు, వైజాగ్‌ పోర్టు నుంచి గంగవరం పోర్టుకు వ్యాపారాలను తరలిస్తున్నారు.'' అని చమురు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, సివిసికి మోయిత్రా ట్వీట్‌ చేసింది. కాగా.. గంగవరం పోర్టును ఎల్‌పిజి దిగుమతుల కోసం అద్దెకు తీసుకునేందుకు సంబంధించి ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ఐఒసి కూడా స్పష్టతను ఇవ్వడం గమనార్హం. నాన్‌ బైడింగ్‌ ఎంఒయుపై సంతకం చేయడం ద్వారా సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొంది. అయితే దీని కోసం ఎటువంటి టెండర్లు మాత్రం పిలువలేదని స్పష్టతనిచ్చింది. ఏడాదికి ఐదు లక్షల టన్నుల సామర్థ్యం కోసం చెల్లింపులు చేయడానికి సిద్ద పడింది. అది తక్కువ పరిమాణంలో ఉన్నా.. ఆ మొత్తానికి చెల్లింపులు చేయాల్సి ఉండటం గమనార్హం. ఐఒసి ప్రస్తుతం ఏడాదికి దాదాపు 7-8 లక్షల టన్నుల ఎల్‌పిజిని దిగుమతి చేసుకోవడానికి వైజాగ్‌ పోర్టును ఉపయోగిస్తోంది. ఈ వ్యాపారాన్ని తెరచాటున క్రమంగా గంగవరం పోర్టుకు తరలించడం ద్వారా అదాని పోర్టుకు లబ్ధి చేకూర్చినట్లవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

  • అదానికి లబ్ధి చేకూర్చే చర్య : జైరాం రమేష్‌

అదాని గ్రూపు నిర్వహిస్తున్న గంగవరం పోర్టు నుంచి నిబంధనలకు విరుద్దంగా ఐఒసి దిగుమతులు చేపట్టడం అంటే అది అదానికి లబ్ధి చేకూర్చడమేనని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేష్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోని వైజాగ్‌ పోర్టు ఉండగా.. గంగవరం పోర్టును ఉపయోగించడం వెనుక ప్రభుత్వ ఒత్తిడి ఉందన్నారు.