Oct 15,2023 09:25
  • నిప్పులు చెరిగిన బుమ్రా
  • వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌కు 8-0 ఆధిక్యత

అహ్మదాబాద్‌ : ఐసిసి వన్డే ప్రపంచ కప్‌లో భారతజట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్తాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ జట్టు ఘన విజయం సాధించింది. పాకిస్తాన్‌ నిర్దేశించిన 192పరుగుల లక్ష్యా న్ని భారత్‌ కేవలం 3వికెట్లు కోల్పోయి 30.3ఓవర్లలోనే ఛేదించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ తొలి వికెట్‌కు అబ్దుల్లా-ఇమామ్‌ కలిసి 41 పరుగులు జోడించారు. ఈ జోడీని సిరాజ్‌ విడగొట్టాడు. ఆ తర్వాత కాసేపటికి ఇమామ్‌ను అద్భుత బంతికి హార్దిక్‌ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌-రిజ్వాన్‌ క్రీజ్‌లో నిలదొక్కుకుని మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. దీంతో పాక్‌ జట్టు 29 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 150 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న దశలో హైదరాబాద్‌ పేజర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మరోసారి దెబ్బతీశాడు. అర్ధశతకం పూర్తిచేసుకున్న బాబర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత రిజ్వాన్‌(49)ను బుమ్రా అద్భుత బంతికి బౌల్డ్‌ చేయడంతో మ్యాచ్‌ స్వరూపం మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్‌ను భారత బౌలర్లు క్రీజ్‌లో కుదురు కునేందుకు అవకాశమివ్వలేదు. సౌద్‌ షకీల్‌ (6), ఇఫ్తికార్‌ అహ్మద్‌(4), షాదాబ్‌ ఖాన్‌(2), నవాజ్‌(4), రవూఫ్‌(2) సింగిల్‌ డిజిట్‌కే పరిమి తం చేశారు. ముఖ్యంగా బుమ్రా 7ఓవర్లలో కేవలం 17పరుగులిచ్చి రిజ్వాన్‌, షాదాబ్‌లను ఔట్‌చేసి మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు. బుమ్రా, సిరాజ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, హార్దిక్‌, జడేజా తలా రెండేసి వికెట్లు తీసారు.
 

                                                                          36పరుగులకు 8వికెట్లు..

పాకిస్తాన్‌ 29.4 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 155పరుగులు చేసి పటిష్టంగా ఉన్న దశలో బాబర్‌ అజామ్‌, రిజ్వాన్‌ వెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత ఒకే ఓవర్‌లో షకీల్‌, ఇఫ్తికార్‌ ఔట్‌ కావడంతో పాకిస్తాన్‌ కేవలం ఐదు ఓవర్ల వ్యవధిలో ఐదు వికెట్లను కష్టాల్లో పడింది. ఆ తర్వాత మహ్మద్‌ నవాజ్‌(4), హసన్‌ అలీ(12), హారిస్‌ రవూఫ్‌(2) కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో పాకిస్తాన్‌ కేవలం 36 పరుగుల వ్యవధిలో చివరి ఎనిమిది వికెట్లను చేజార్చు కొని 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. .
ఛేదనలో టీమిండియా తొలుత గిల్‌ (16), కోహ్లీ (16) వికెట్లను త్వరగా కోల్పోయింది. రోహిత్‌(86) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కి తోడు శ్రేయస్‌ అయ్యర్‌(53నాటౌట్‌) నిలకడగా ఆడారు. రోహిత్‌ ఔటయ్యాక కెఎల్‌ రాహుల్‌ (19నాటౌట్‌)తో శ్రేయస్‌ మ్యాచ్‌ ముగించాడు. షహీన్‌ అఫ్రిదికి రెండు, హసన్‌ అలీకి ఒక వికెట్‌ దక్కాయి. దీంతో వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కు ఇది 8వ విజయం. భారత్‌ 19న బంగ్లాదేశ్‌తో ఆడనుంది.
 

                                                                 వన్డే ప్రపంచకప్‌లో నేడు
ఇంగ్లండ్‌ × ఆఫ్ఘనిస్తాన్‌ (వేదిక: ఢిల్లీ; మ.2.00గం||లకు)