మానవత్వం లేనోళ్లు
మనిషిగా బతకలేనోళ్ళంతా
సామూహికంగా సచ్చిపోతే బాగుండు
ఇంకా మనం
స్వతంత్ర దేశంలోనే వున్నామా...
మానవ మాత్రులుగా బతుకీడుస్తున్నామా...
క్రూరమృగాలు సైతం
ఇలా చేయవు కదా
ఇది మెదడు బుద్ధీ వున్న
మనుషుల కృత్యమేనా
ఈ హేయమైన
విశృంఖలమైన దుస్సంఘటనను చూస్తూ
రక్తం సలసలా మరగలేదా ఎవ్వరికీ
చీము నెత్తురుతో ఒళ్లంతా వుడికిపోలేదా ఎవ్వరికీ
దేశాన్ని రక్షించిన సైనికుడు
కళ్లముందే జరిగిన దుశ్శాసన పర్వం నుంచి
తన వాళ్ళను రక్షించుకోలేని
అచేతనం లోకి నెట్టివేయబడ్డాడా
ప్రాణభయం దుర్భర దృశ్యాలకు తలొగ్గిందా
అక్కడ
మనిషితనం పూర్తిగా చచ్చిపోయిందా?
అందరూ మూట గట్టుకొండి
తిలా పాపం తలా పిడికెడు
రక్షణ వ్యవస్థలు దిగంబరమై పోయాయా
ఈ ఉన్మాద రాక్షస క్రీడకు స్వస్తి వాక్యం ఎప్పుడు
అభి'మానం' నిలువెల్లా అల్లాడి
విలువల వలువలూడి పోయాక
దేశమంతా ప్రాణం లేని కళేబరమే కదా
అక్కడి
అమానవీయతకు చితులు పేర్చండి
పాపాత్ములను బూడిద చేసే ఖననానికి
మనుషులేవరైనా హాజరు కాండి ...
వంట గరిటల్ని పట్టిన అమ్మలారా
గొడ్డళ్లు.. గునపాలు... తుపాకులు పట్టండి
కలుపు మొక్కల్ని తొలగించే
మీ చేతి కొడవళ్ళతోనే
మీ నూలు పోగుల్ని వొోలిచిన చేతుల్ని
మీ మానాన్ని తాకిన దిసమొలల్ని
తెగనరకండి తల్లులారా...!
మానవ చరిత్రను మనిషి గమనాన్ని
నీచాతి నీచంగా లిఖిస్తున్న
ఈ చండాలపు జాతి జాతంతా
చచ్చిపోతే బాగుండు!
తలారా స్నానం చేసి
నాలుగు మంచి వాక్యాలు రాసుకుంటాను..!
- డాక్టర్ కటుకోఝ్వల రమేష్
99490 83327










