Dec 18,2022 08:04

రగులుతున్న ఆకలి యుద్ధాలలో
ఎండిపోతున్న పేగుల చరిత్రను
లిఖితపూర్వకంగా ఎక్కించాల్సిందే

రంగు రంగుల జెండా కర్రలు
ఎజెండాలను మోస్తూ
ఎద్దేవాల కథల మలుపుల వెనుక
విరుపుల నిజాన్ని విని తీరాల్సిందే
నాటి మాటలు నీటి మూటలై
భరోసాల బరువులు మోస్తున్న
పేద వీపును నిమరాల్సిందే
ఇవన్నీ మూకుమ్మడిగా
చరిత్ర పుటల్లోకి తోచేయాల్సిందే

మారుతున్న వర్గ వర్ణాల వెల్లువలో
కొత్త కొత్త రూపకల్పనల వెనుక
ఎగస్తున్న వివక్షత కోరల్లో
నలిగిపోతున్న వ్యవస్థ అవస్థలన్నీ
ఏకధాటిగా వాక్యాలై నినదించాల్సిందే

ఏనాడూ ఎరుగని
ఏకపక్ష ప్రతిపక్ష యుద్ధాల పరంపరలో
వినూత్న రీతులు
ఆవిష్కతమౌతున్న కాలం కథ
ఒక పేజీలో రెపరెపలాడాల్సిందే

ప్రతిఘటనల తీరుబడిలో
అప్రకటిత వ్యవహార శైలి పురివిప్పాక
ఎన్నడూ ఎరుగని రాజకీలక విన్యాసం
రాబోవు తరాల పుస్తకాలలో
గుణపాఠాలుగా ఒదిగిపోవాల్సిందే

ఎర్రజెండాల తిరుగుబాటులో
సామాజిక చైతన్యాల కోసం
సుదీర్ఘ పోరుబాట విప్లవాక్షరాలు
మరచిపోని చరిత్ర పేజీలు కావాల్సిందే
మారుతున్న కాల గతులు
కరిగిపోతున్న విలువల వ్యథలు
చరిత్రలో మరో మైలురాయిగా
లిఖించి చదివించాల్సిందే

- నరెద్దుల రాజారెడ్డి
ఫోన్‌: 9666016636