Jun 05,2023 08:03

సంభవామి యుగేయుగే అంటావు
దైవాన్ని ముక్కలు ముక్కలు చేసి
ఒక్కో ముక్కకు ఒక్కో మతం రంగు పూస్తావు
మతోన్మాదం రగిల్చి విద్వేషం నింపుతావు.
దేవుడి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తావు !
సీత కన్నీరు ఎంత విధ్వంసం సృష్టించిందో?
ద్రౌపది విడిన కొప్పు సార్వభౌముడి తొడలెలా విరగ్గొట్టిందో?
పురాణాలు ప్రవచిస్తావు! అంతస్సారాన్ని అంగీకరించవు!
ఝాన్సీరాణి పోరాటమే తెల్లదొరల అంతానికి
తొలి కొరడాదెబ్బ అయిందని చదవలేవు!
మాంచాల, మల్లమ్మ, నిర్మలమ్మ
చరిత్రలో మండుతున్న నిప్పురవ్వలు!
భేటీ బచావో అని వాక్రుస్తావ్‌!
ముగురమ్మల్ని పదేపదే స్తుతిస్తావ్‌!
శక్తిస్వరూపులై దేశానికి పతకాలను కొల్లగొట్టి తెచ్చిన
మహిళా రెజ్లర్లను బూటుకాలు పెట్టి అదుముతావ్‌!
పతకాల కన్నీటితోనైనా మతకలుషితగంగ
పవిత్రీకృతం అవుతుందా?
ఆర్యావర్తం విద్వేషపు విషం నుంచి ఒడ్డెక్కుతుందా?
గుర్తుందా? హిట్లర్‌, ముసోలినీల అంతిమ పయనం!
మసిపూస్తే మాసిపోయేది చరిత్ర కాదు!
కళ్ళుమూసుకొని పిల్లి పాలుతాగితే
పడాల్సిన వేటు పడకమానదు!
కాల గమనం ఆగిపోదు !
 

- గార రంగనాథం, 98857 58123