Jan 15,2023 12:36
  • 2024లో ప్రాంతీయ పార్టీలే కీలకం : అమర్త్యసేన్‌

న్యూఢిల్లీ : అధికార బిజెపికి ఎదురులేదని భావించటం పొరబాటని నోబెల్‌ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్తసేన్‌ అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో (2024) ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. శనివారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ''రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు డిఎంకె, సమాజ్‌వాదీ కీలకంగా వ్యవహరిస్తాయి. బిజెపికి ఎదురునిలిచే పార్టీ లేదనే ఆలోచన సరైంది కాదు. అలాగే కాంగ్రెస్‌, ఎన్‌సిపి, జెడియు కొత్త పొత్తులకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు భారత్‌ విజన్‌ను అధికార బిజెపి గణనీయంగా తగ్గించింది. ఈ సమయంలో బిజెపికి ప్రత్యామ్నాయం లేకపోతే మంచిది కాదు. ఆ పార్టీకి బలంతోపాటు బలహీనత లున్నాయి. మిగతా పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తే...గట్టి పోటీ ఇవ్వొచ్చు'' అని అమర్త్యసేన్‌ అభిప్రాయ పడ్డారు. పార్టీ బలహీన పడిందని కాంగ్రెస్‌ తనకు తానుగా భావిస్తోం దన్నారు. దీంతో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ భారత్‌లోని వివిధ వర్గాల విజన్‌ను కాంగ్రెస్‌ ముందుకుతీసుకెళ్లగలదని అన్నారు.
 

                                                   మైనార్టీల ప్రాధాన్యత తగ్గించేందుకే సిఎఎ

దేశంలో మెజార్టీ వాదాన్ని బలోపేతం చేసేందుకు, మైనార్టీల పాత్రను తగ్గించేందుకు పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) మోడీ సర్కార్‌ తీసుకొచ్చిందని అమర్త్యసేన్‌ అన్నారు. ''సమాజంలోని అన్నివర్గాల ప్రజల కోసం మహాత్మాగాంధీ రాజకీయాల్ని కొనసాగించారు. ఇప్పటివరకూ నేను చూసినదాని ప్రకారం, అధికార బిజెపి లక్ష్యం ఒకటే. సిఎఎ ద్వారా రాజకీయాల్లో మైనార్టీల ప్రాధాన్యతను తగ్గించటం మోడీ సర్కార్‌ లక్ష్యం. లౌకిక దేశంగా భారత్‌లో ఇలాంటి చట్టం చేయటం దురదృష్టకర''మని అన్నారు.