ప్రశ్నించే గొంతుక
నరాన్ని తెంచుతారెందుకు?
ఎదిరించే పిడికిలి
ఎముకను విరుస్తారెందుకు ?
నిలదీసే గుండె
ధైర్యాన్ని తొక్కుతారెందుకు?
నిప్పులు కక్కే కళ్ళు
పొడుస్తారెందుకు?
ఓటు వేసిన వేలును
నిర్దాక్షిణ్యంగా నరుకుతారెందుకు?
చలి చీమల కథ వినలేదా?
గడ్డి పరకల బలం చూడలేదా?
గత చరిత్ర పుటలు
ఇంకా చెదలు పట్టనే లేదు
ప్రతి పుటను పరిశీలిస్తే
ప్రజాస్వామ్యపు పునాదులు
చెక్కుచెదరనే లేదు
పునాదులు కదిలితే
ఎవరి పీఠాలైనా కూలిపోవాల్సిందే!
- కయ్యూరు బాలసుబ్రమణ్యం










