Aug 24,2023 22:23

న్యూయార్క్‌: అమెరికా టెన్నిస్‌ ఆటగాడు జాన్‌ ఇస్నర్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ క్రీడకు గుడ్‌బై చెప్పాడు. ఏస్‌ కింగ్‌గా పేరుగాంచిన 38ఏళ్ల ఇస్నర్‌ ట్విటర్‌ వేదికగా తన రిటైర్మెంటన్‌ నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇస్నర్‌ గురువారం పోస్ట్‌ చేసిన ట్విటర్‌లో 'ఆండీ ముర్రేతో ఆడిన ప్రతి ఒక్క మ్యాచ్‌ను ఆస్వాదించాను. నేను అతనికంటే గొప్ప ఆటగాడిని కాను. నా కెరీర్‌ విజయాల్లో అతి పెద్ద గెలుపు ముర్రేపై విజయం సాధించడమే. ఇక సెలవు' అని పేర్కొన్నాడు. యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ప్రారంభం ముందు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో అభిమాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 6.10అడుగుల ఎత్తుగల ఇస్నర్‌ 2010 వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో నికోలస్‌ మహాట్‌తో సింగిల్స్‌ మ్యాచ్‌ను సుమారు 11గంటల 5నిమిషాలసేపు లాంగెస్ట్‌ మ్యాచ్‌ ఆడి చరిత్ర నెలకొల్పాడు. ఐదో సెట్‌ను 70-68తో గెలిచాడు. ఇటీవల జరిగిన వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సెమీస్‌కు చేరిన ఇస్నర్‌ కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ 2018లో 8వ ర్యాంక్‌ను సాధించాడు. కెరీర్‌లో మొత్తం 16 ఏటిపి సింగిల్స్‌ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. అలాగే ఏటిపి కెరీర్‌లో ఏకంగా 14వేలకు పైగా ఏస్‌లు సంధించి రికార్డు నెలకొల్పాడు.