Dec 30,2022 10:50
  • జిల్లాలకు అరకొరగా కేటాయింపులు
  • కందిపప్పుదీ అదే పరిస్థితి

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : పండగ నెలలోనూ అందరికీ రేషన్‌ అందే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి మొబైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ యూనిట్లు (ఎండియు) ద్వారా లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేస్తోంది. ఒకటో తేదీకి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా జిల్లాలకు అంతంత మాత్రంగానే పంచదార, కందిపప్పు వచ్చాయి. ఈ పాటికే పౌరసరఫరాల గోదాములకు సరుకులు చేరాల్సి ఉండగా, అరకొరగా చేశాయి. డిసెంబర్‌ నెల ఆధారంగా ప్రభుత్వం కేటాయింపులు జరుపుతుందని అధికారులు చెప్తున్నారు. ఆ లెక్కల ప్రకారం చూసుకున్నా చాలా లోటు కనిపిస్తోంది. మరోవైపు పూర్తి స్థాయిలో సరుకులు అందుబాటులో లేకున్నా డిడిలు చెల్లించాలంటూ డీలర్లపై అధికారులు ఒత్తిడి చేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.రాష్ట్రంలో 1,45,50,854 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఒక్కో కార్దుదారునికీ అరకేజీ పంచదార అందించాల్సి ఉంది. ఈ లెక్కన 7,506.72 టన్నుల పంచదార కేటాయించాల్సి, ఉండగా 2,877.96 టన్నుల మాత్రమే జిల్లాలకు ప్రభుత్వం సరఫరా చేయగలిగింది. ఒక్కో కార్డుపై కేజీ కందిపప్పును అందించాల్సి ఉంది. ఈ లెక్కన 15,717 టన్నులను సరఫరా చేయాల్సి ఉండగా, 3,994 టన్నులు మాత్రమే కేటాయించింది. డిసెంబర్‌లో పంపిణీ ఆధారంగానే కేటాయింపులు ఉంటాయని చెప్తుండడంతో జనవరి నెలలోనూ పూర్తి స్థాయిలో రేషన్‌ సరుకులు అందే పరిస్థితి కనిపించడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో 6,58,257 రేషన్‌ కార్డుదారులకు సరఫరా చేసేందుకు 652 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు అవసరం. ఇప్పటివరకు 283 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. మరో 50 టన్నులు ఒకట్రెండు రోజుల్లో జిల్లాకు చేరనుంది.
           అయినా, ఇంకా 319 టన్నులు కావాల్సి ఉండడంతో ఆ మేరకు తమకు కందిపప్పు పంపాలని జిల్లా అధికారులు పౌరసరఫరాల కమిషనర్‌కు లేఖ రాశారు. మిగిలిన కందిపప్పు జిల్లాకు చేరడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన పలు సంస్థలు రాష్ట్రానికి కందిపప్పును సరఫరా చేస్తున్నాయి. కందిపప్పు సరఫరాకు టెండర్లను పిలవాల్సి ఉన్నా, ఇప్పటివరకు ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇదంతా జరిగే సరికి పంపిణీ సమయం ముగిసిపోతుందనే చర్చ జరుగుతోంది. పంచదార నిల్వల పరిస్థితీ అలానే ఉంది. జిల్లాకు 380 టన్నుల పంచదార అవసరం కాగా, 202 టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
 

                                                   నిల్వలు లేకుండా డిడిలు తీయాలని డీలర్లపై తీవ్ర ఒత్తిడి

రేషన్‌ దుకాణాలకు కందిపప్పు, పంచదార సరఫరాకు డీలర్లు ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తారు. సరుకుల లభ్యత, వినియోగం ఆధారంగా డీలర్లు డిడిలు తీస్తారు. ఈసారి సరుకుల లభ్యత తక్కువగా ఉందన్న సమాచారంతో డిడిలు తీయడానికి డీలర్లు ఆసక్తి కనబర్చడం లేదు. అప్పు చేసి డిడిలు తీసిన సొమ్ము ప్రభుత్వం దగ్గర ఉండిపోతే తాము వడ్డీలు చెల్లించాల్సి వస్తుందనే ఆలోచనతో ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో, పౌర సరఫరాల డిప్యూటీ తహశీల్లార్లు రంగంలోకి దిగి డీలర్లకు ఫోన్లు చేయడంతోపాటు వాట్సాప్‌ సందేశాలు పంపిస్తున్నారు. పంచదార, కందిపప్పు కోసం విధిగా డిడిలు తీయాలని ఆదేశిస్తున్నారు. డిడిలు తీయని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. కందిపప్పు, పంచదార నిల్వలు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో ఉన్నాయంటూ చెప్తున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతో తాము కట్టిన సొమ్ములతోనే కందిపప్పు, పంచదారను కొనుగోలు చేసి సరఫరా చేస్తోందేమో అన్న చర్చ డీలర్లలో సాగుతోంది.