Nov 27,2022 08:17

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ప్రభుత్వ సమాచార వ్యవస్థలో మరో కీలకమైన కోర్‌ డాష్‌బోర్డ్‌ కూడా మాయమైపోతోంది. దాదాపు 40 శాఖలకు పైగా ఈ డాష్‌బోర్డ్‌లో తమతమ శాఖల సమాచారాన్ని నిక్షిప్తం చేస్తాయి. ఇవి ప్రజలకు కూడా ఎంతో అందుబాటులో ఉంటాయి. చాలాకాలంగా ఎటువంటి దాపరికం లేకుండా ఈ డాష్‌బోర్డ్‌లో సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. అయితే కొద్ది నెలలుగా ఈ డాష్‌బోర్డ్‌ నిర్వీర్యమైపోతోంది. శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఈ సైట్‌లో పొందుపరడం లేదు. ఇది మరో ప్రభుత్వ ఉత్తర్వుల సైట్‌గా అంతరించిపోతోందని తెలుస్తోంది. ప్పుడో దశాబ్దాల కాలం కితమే అన్ని శాఖల సమాచారాన్ని ఒకే చోట నిక్షిప్తం చేసేందుకుగాను కోర్‌ డాష్‌బోర్డ్‌ను రూపొందించారు. ప్రతి శాఖకు సంబంధించిన పథకాలు, వాటి అమలు, అందుకు సంబంధించిన గణాంకాలను కూడా ఏ రోజుకారోజు సైట్‌లో పొందుపరిచేవారు. పలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన లబ్దిదారుల వివరాలు కూడా ఇక్కడే కనిపించేవి. కొద్దిరోజులుగా దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంటోంది. కారణాలేమిటో స్పష్టంగా తెలియనప్పటికీ ఈ సైట్‌ను వినియోగించేందుకు ప్రభుత్వం ఇష్టపడడం లేదని అంటున్నారు. ఒకటి రెండు సైట్లు మాత్రం నేరుగా ఆయా శాఖల ప్రధాన సైట్లకు మళ్లేలా చూస్తున్నారు .కొన్ని సైట్లలో అప్‌డేట్‌ జరిగి రెండేళ్లకు పైగానే అయినట్లు చూపిస్తోంది. కొద్ది నెలల క్రితమే కీలక వెబ్‌సైట్‌ అయిన జీఓఐఆర్‌ (ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసే సైట్‌)ను కూడా ప్రభుత్వం మూసివేసింది. తరువాత దీనిపై వివాదం నెలకొనడం, కోర్టుకు కొంతమంది వెళ్లడంతో గెజిట్‌ సైట్‌ ద్వారా ఒకటీ అరా ఉత్తర్వులు పెడుతున్నారు. అయితే జీఓఐఆర్‌ను మాత్రం ఇప్పటివరకు పునరుద్ధరించలేదు. ఇప్పుడు డాష్‌బోర్డ్‌ కూడా ఇదే తరహాలో కనుమరుగు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.