- ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ సభలో రైల్వే బోర్డు సభ్యులు వాసుదేవ్ ఆచార్య
- ఉద్యోగుల హక్కుల సాధన కోసం కలిసికట్టుగా పోరాటం
- నేడు ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ నూతన కమిటీ ఎన్నిక
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రైల్వేలను మోడీ ప్రభుత్వం ప్రైవేటుకు కట్టబెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (ఎఐఎల్‌ఆర్‌ఎస్) చేస్తున్న పోరాటానికి యువత మద్దతునివ్వాలని రైల్వేస్టాండింగ్ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపి వాసుదేవ్ ఆచార్య పిలుపునిచ్చారు. రైల్వేలు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం జాతీయ విధానానికి వ్యతిరేకమన్నారు. పాలసీల పేరుతో కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని, కొత్తగా నాయకత్వ బాధ్యతలు స్వీకరించనున్న యువ నాయకత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని సూచించారు. రైల్వేలో ఉద్యోగుల హక్కులను కాపాడుకోవడంతోపాటు ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ బలోపేతానికి యువలోకో పైలట్లు కృషి చేయాలన్నారు విజయవాడ ఎంబివికెలో మంగళవారం ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆలిండియా 23వ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో భాగంగా ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభ నిర్వహణకు ప్రిసీడియం సభ్యులుగా ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ జాతీయ అధ్యక్షుడు ఎల్.మోనీ, ఎన్‌బి.దత్త, టి.హనుమయ్యను నియమించారు. సభలో వాసుదేవ్ ఆచార్య మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల సాధన కోసం కార్మికులందరూ కలిసి కట్టుగా పోరాటాన్ని ఉదృతం చేయాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన జాతీయ అధ్యక్షుడు ఎల్ మోనీ మాట్లాడుతూ తమ హయాంలో దేశంలో ఆర్గనైజేషన్ బలోపేతానికి కృషి చేశామన్నారు. సెక్రటరీ జనరల్ ఎంఎన్ ప్రసాద్, జెఎస్ టంక్ కార్యదర్శి నివేదికను, కెసి జేమ్స్ ఆర్థిక నివేదికను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా ఎంఎన్ ప్రసాద్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 98 వేల మంది లోకోలు ఉండగా ఇందులో ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎకు 50వేల మంది సభ్యత్వం కలిగి ఉందని, నూతన కమిటీ సభ్యత్వం 75 వేలకు పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. స్క్వాడ్ పేరుతో ఉద్యోగాల నుంచి తొలగించిన లోకోలను తిరిగి ఉద్యోగంలోకి తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశామన్నారు. లోకోమోటివ్స్‌లో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, మహిళలకు రన్నింగ్ రూముల్లో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు ధర్నా, ఉపవాస దీక్షలు, మానవ హారాల పద్దతుల్లో చేయాలన్నారు. బుధవారం జరిగే యూనియన్ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిని కూడా నియమించినట్లు తెలిపారు. జాతీయ మహాసభల్లో చేసిన ముసాయిదా తీర్మానాన్ని ప్రధాన మంత్రి, రైల్వే బోర్డుకు ఇస్తామని పేర్కొన్నారు. రైల్వేలు ప్రైవేటీకరణ అయితే జర్నలిస్టులు, వికలాంగులు, పద్మ అవార్డు గ్రహీతలు, క్రీడాకారులకు ఇచ్చే రాయితీలు రద్దవుతాయన్నారు.










