- రైతుల డిమాండ్
- రేపు తుది నిర్ణయం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం (కెఆర్‌ఎంబి)ను కృష్ణా నది పరివాహక ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బోర్డు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై బుధవారం నిర్వహించే కెఆర్‌ఎంబి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వ నిర్ణయం అమలైతే నీటి పంపిణీలో సమస్యలు వచ్చినపుడు రైతులు, రైతుసంఘాలు వినతిపత్రం ఇవ్వడానికి కూడా అంత దూరం వెళ్లాల్సిఉంటుంది. ఇది తెలంగాణాలోని మహబూబ్‌నగర్, నల్గొండ ఉమ్మడి జిల్లాలతోపాటు రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం ఉమ్మడి జిల్లాల రైతులకు కూడా తలకు మించిన భారమవుతుంది. బోర్డు సమావేశాల కోసం స్థానిక అధికారులు కూడా తరచు విశాఖకు వెళ్లాల్సివస్తుందని, ఫలితంగా రైతులకు అందుబాటులో ఉండరన్న ఆందో ళన వ్యక్తమవుతోంది. ఆ పరిస్థితి ఏర్పడితే రైతాంగం పరిస్థితి మరింత క్లిష్టమవుతుందంటున్నారు. ఈ కారణంగానే తెలంగాణ ప్రభుత్వం కెఆర్‌ఎంబిని విశాఖకు తరలించాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరే కిస్తోంది. రాష్ట్రానికి చెందిన అధికారుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతున్నా, ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపో వడం గమనార్హం. విశాఖకు బదులుగా రాష్ట్రంలోని కృష్ణానది పరివాహకప్రాంతంలో ఏ జిల్లాలోనైనా బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
అర్థరహితం
కృష్ణానదిపై వున్న ప్రాజెక్టుల ఆపరేషన్‌లు ఒక చోట నదిజలాల నిర్వహణకు సంబం దించిన కార్యాలయం మరోచోట వుండాల నడం అర్థరహితం. శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజిలులాంటి కీలకమైన ప్రాజెక్టులు వున్న ఈ ప్రాంతాంలోనే బోర్డు కార్యాలయం పెట్టడం సమంజసం అవుతుంది తప్ప ఎక్కడో దూరంలో వున్న విశాఖపట్నంలో పెట్టాలను కోవడం సరైంది కాదు.
- వై కేశవరావు రైతు సంఘం సీనియర్ నాయకులు
విజయవాడలో ఏర్పాటు చేయాలి
కెఆర్‌ఎంబి కార్యాలయంను విజయవాడలోనే ఏర్పాటు చేయాలి. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో కాకుండా వెయ్యి కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నంలో పెట్టడం సరైందికాదు. తెలంగాణాకు కూడా విశాఖపట్నం దూరమని వ్యతిరేకిస్తోంది, అందరికీ అందుబాటులో వుండేలా విజయవాడలో పెట్టడమే సమంజసం.
-ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు,
రాష్ట్ర సాగునీటి సంఘాల అధ్యక్షులు










