- హమాస్ ముప్పును తేలిగ్గా తీసుకున్నారా ?
జెరూసలేం : ఇజ్రాయిల్‌పై హమాస్ విస్మయ పరిచే రీతిలో జరిపిన మెరుపుదాడులు, ఇజ్రాయిల్ భీకర వైమానిక దాడులతో అతలాకుతలమవుతున్న పశ్చిమాసియా ప్రాంతం ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంవైపు మళ్ళుతోంది. ఇప్పటికే ఇరువైపులా వేలాదిమంది మరణించారు. హమాస్‌దాడులను ఇజ్రాయిల్ ఊహించలేకపోయింది. దీనికి ఆ దేశ భద్రత, నిఘా సంస్థల వైఫల్యమే కారణామా? అన్న చర్చ మొదలైంది.
హమాస్ నుండి ఎదురయ్యే ప్రతిఘటనను ఇజ్రాయిల్ భద్రతా బలగాలు చాలా తక్కువగా అంచనా వేశాయని, వారు పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేదని, అదే ఈ పరిస్థితులకు దారి తీసిందనేది అర్థమవుతోంది. కోట్లాది డాలర్ల వ్యయంతో అత్యంత అధునాతనంగా కట్టిన గాజా సరిహద్దుగోడను హమాస్ తీవ్రవాదులు చాలా సులభంగా పగలగొట్టారు. హమాస్ వద్ద అత్యంత అధునాతనమైన ఆయుధాలేమీ లేవు. కేవలం చవకబారు డ్రోన్‌లు, బుల్డోజర్లు, బాంబులతోనే వారు సరిహద్దు భద్రతా దళ సిబ్బందిపై పైచేయి సాధించి, హింసకు పాల్పడి, పేరా గ్లైడర్లు, మోటార్ సైకిళ్ళపై బందీలను తీసుకెళ్ళారు. ఇదేమీ అప్పటికప్పుడు చేసిన ఆపరేషన్ అయితే కాదు, ఒకేసారి పలు ప్రాంతాలపై దాడులతో విరుచుకుపడి, ప్రజలను బందీలుగా చేపట్టారు. ఇలాంటి తరహాలో ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన ఆపరేషన్‌కు ప్రధానంగా కావాల్సింది అత్యంత జాగరూకతతో కూడిన ప్రణాళిక, సమన్వయం, ప్రాక్టీస్, సమయం ఇవన్నీ అవసరమే.
ఈ మొత్తం వైఫల్యం వెనుక ప్రధానంగా కనిపిస్తున్నది ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ వైఫల్యం, ముందు పొంచివున్న ముప్పును గుర్తించి హెచ్చరించడంలో విఫలమయ్యారా లేక ముప్పును అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలయ్యారా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా హమాస్ గత రెండేళ్ళుగా అనుసరిస్తున్న వ్యవహార శైలి కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. హమాస్ వైపు నుండి పెద్దగా ఎలాంటి రెచ్చగొట్టే, కవ్వింపు చర్యలు లేకపోవడంతో ఇజ్రాయిల్ కూడా తేలిగ్గా తీసుకుంది. కానీ హమాస్ లోలోపలే తన ప్రణాళికలను పక్కాగా రూపొందించుకుంటూ అనువైన సమయం చూసుకుని ఒక్కసారిగా దాడికి తెగబడింది. అది కూడా ఇంటెలిజెన్స్ వర్గాల కన్నుకప్పేలా వ్యవహరించడంలో హమాస్ విజయం సాధించింది. ఇంత పెద్ద ఎత్తున సాగించిన సంక్లిష్టమైన ఆపరేషన్‌ను ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ ఇంటెలిజెన్స్ సర్వీసుల్లో ఒకటైన మొస్సాద్ కన్నుగప్పి ఎలా చేయగలిగారో నిర్ధారించడం ఇక్కడ అవసరం. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితులపై దృష్టి పెట్టడం ఇప్పుడు తక్షణ అవసరం. యుద్ధాన్ని ముగించి, శాంతి, భద్రతలను నెలకొల్పడం తక్షణావశ్యకత. అదే సమయంలో ఇంతటి ఆకస్మికదాడి ఎలా జరిగింది, దానికి గల కారణాలను కూలంకషంగా విచారించడానికి కూడా ఇది సరైన సమయమే. మరింత భద్రతతో కూడిన భవిష్యత్తును ప్రజలకు అందించాలంటే ఏం జరిగిందీ, ఎలా జరిగిందీ అన్నది దర్యాప్తు చేపట్టాల్సిందే.