Feb 07,2023 15:31

బిజెపి రాయలసీమ డిక్లరేషన్‌ ఫార్స్‌
- అభ్యంతరాలున్న అప్పర్‌ భద్రకు జాతీయ ప్రాజెక్టు హోదా
- ఏడాదిగా మొద్దునిద్రలో రాష్ట్ర ప్రభుత్వం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.20 వేలకోట్లు కేటాయించాలన్నది 2018లో బిజెపి ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్‌లో కీలకమైన డిమాండ్‌. నాడు హడావిడి చేసిన బిజెపి ఇప్పుడు అదే రాయలసీమను ఎడారిలా మార్చే చర్యలకు పూనుకోవడం పట్ల రాష్ట్ర రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అతి తక్కువ వర్షపాతం ఉన్న రాయలసీమ జిల్లాల పంటలను, గొంతుల తడిపే ప్రాజెక్టులను నిర్వీర్యం చేసేలా తుంగభద్ర నదిపై నికరజలాలు, అనుమతులు లేని ప్రాజెక్టుకు దిగువ రాష్ట్రాల అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం రూ.5,300 కోట్లు కేటాయించింది. అప్పర్‌ భద్రకు ఎలాంటి చట్టబద్ధ నీటి కేటాయింపు లేదు. అయినా కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన పునపంపిణీలో కేటాయింపులకు మించి అప్పర్‌ భద్రను చేపట్టింది. వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లో సాగు, తాగునీటిని అందించే హంద్రీనీవా సుజలస్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, వెలిగొండ వంటి కీలక ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విభజన చట్టం చెబుతున్నా ఏ మాత్రం స్పందించని బిజెపి ప్రభుత్వం ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికల లబ్ధి కోసం నిధులను కేటాయించింది. రాయలసీమలో ఉన్న అరకొర సాగునీటిని కూడా కర్ణాటకకు మళ్లించేలా కేంద్రం ప్రభుత్వం నిధులను కేటాయించడం పట్ల రాష్ట్ర రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేలా కేంద్ర ప్రభుత్వం అప్పర్‌ భద్రకు జాతీయ హోదా కల్పించేందుకు ఏడాది క్రితం చర్యలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల తర్వాత మేల్కనడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర జలసంఘం నియమించిన హైపవర్డ్‌ స్టీరింగ్‌ కమిటీ 2021 డిసెంబరు 6న ఏర్పాటు చేసిన 13వ కమిటీ సమావేశంలో అప్పర్‌ భద్రపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పింది. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 15న జరిగిన 14వ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం హాజరుకాలేదు. ఏడాదిపాటు ఈ విషయంపై మౌనంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాక న్యాయ పోరాటం పేరుతో హడావిడి చేయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.