ఎంఎల్‌సి పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ నమోదులో అక్రమాలు : సిపిఎం నేత ఎం.జగ్గునాయుడు
ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ (విశాఖ) : ఎంఎల్‌సి పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ నమోదులో అక్రమాలు జరిగాయని దీనిపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపించాలని సిపిఎం విశాఖపట్నం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం మద్దిలపాలెంలోని సిపిఎం నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గంలో మొదట దశలో నమోదైన ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించిందని, నమోదు ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తెలిపారు. అనర్హులను పథకం ప్రకారం వైసిపి నమోదు చేయించిందన్నారు. ఓటర్ల నమోదులో జరిగిన అక్రమాలపై విచారణ, వెరిఫికేషన్ ప్రత్యేక ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో జరిపించాలని ఎన్నికల కమిషనర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
నియోజకవర్గంలో ఓటర్ నమోదు చివరి రోజున అనగా నవంబర్ 7వ తేదీ ఒక్కరోజులోనే 87 వేల ఓట్లు నమోదయ్యాయని అన్నారు. వీటిపై ప్రత్యేక విచారణ జరిపించాలని కోరారు. మొత్తం 2 లక్షల 43 వేల 903 ఓటర్లను అర్హులుగా ప్రకటించారని, అర్హుల ఓటర్లను వేల సంఖ్యలో నమోదు చేయలేదని చెప్పారు. డిగ్రీ అర్హత లేనివారి పేర్లు వేల సంఖ్యలో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఉన్నాయని తెలిపారు. డిగ్రీ సర్టిఫికెట్ లేని వారిని నమోదు చేశారని అన్నారు. 10వ తరగతి ఐటిఐ పాలిటెక్నిక్ సర్టిఫికెట్స్ కలిగిన వారిని ఓటర్లగా చేర్పించారు. 2019 అక్టోబర్ 30 తర్వాత అనగా 2020, 2021 2022 సంవత్సరాలలో డిగ్రీ పాసైన వారిని కూడా ఓటర్ గా నమోదు చేశారని, ఇలాంటివారు వేల సంఖ్యలో ఉన్నారని, అంతేకాకుండా ఒక వ్యక్తి 2 నుండి 5 సార్లు ఓటర్ జాబితాలో నమోదయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతి నమోదుబూతులో ఇలాంటివి 50 నుండి 80 వరకు ఉన్నాయని, ఇదంతా ఒక పథకం ప్రకారం కుట్రతో నమోదు జరిగిందని ఆరోపించారు. అన్ని అర్హతలు ఉండి గెజిటెడ్ సంతకంతో ఆఫ్ లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిని ఎలాంటి పరిశీలన జరగకుండానే తొలగించారని అన్నారు. డిజిగేటెడ్ ఆఫీసర్ దరఖాస్తు పరిశీలించి, ఎక్నాలెడ్జిమెంట్ కూడా ఇచ్చారని, అయినా నమోదు చేయలేదని చెప్పారు. విశాఖ జిల్లాలో సుమారు వేల సంఖ్యలో అర్హత ఉన్న వారి దరఖాస్తులను దురుద్దేశంతోనే నమోదు చేయలేదని మండిపడ్డారు. తిరస్కరించబడిన ఓటర్ జాబితాను వెంటనే ప్రకటించాలని కోరారు. దీనివల్ల అభ్యంతరాలు చెప్పటానికి తిరిగి నమోదు. చేసుకోవడానికి సులభం అవుతుందన్నారు. ఓటర్స్ అప్లికేషన్లు డిగ్రీ సర్టిఫికెట్లతోపాటు ఏ సంవత్సరంలో డిగ్రీ పాసయ్యారో వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టాలని డిమాండ్ చేశారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను ఎక్సెల్ ఫార్మెట్లో పెట్టాలని, దీనివల్ల ఓటర్ ఓటు నమోదు చేసుకున్నవారు ఓటు నమోదు అయ్యిందా లేదా ఏ బూత్ లో ఉంది తెలుసుకోవడానికి వీలవుతుందని ఆన్ లైన్లో నమోదు అయిన ఎక్కువ దరఖాస్తులను బిఎల్‌ఓలు వైసిపి నాయకుల ఒత్తిడితో వెరిఫికేషన్ చేయలేదని అన్నారు. పైన తెలిపిన అక్రమాల, అనర్హుల ఓటర్లపై ప్రత్యేక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో విచారణ జరిపి అనర్హులను తొలగించాలని, అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిడిఎఫ్ అభ్యర్థి డాక్టర్ ఏ.రామప్రభా ఇప్పటికే పలు అభివఅద్ది కార్యక్రమలలో చురుగ్గా పాల్గంటూ ప్రజలకు జరుగుతున్న అన్యాయలపై పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఆమెను బలపరిచి గెలిపిస్తే శాసన మండలిలో ప్రజా ప్రయోజనాలపై మరింత పోరాటం చేసే అవకాశం ఉంటుందని ఆశించారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, డాక్టర్ బి.గంగారావు, కె.ఎం. శ్రీనివాస్, బి.జగన్ తదితరులు పాల్గొన్నారు.










