Aug 26,2023 08:40

జాబిలితో చెలిమి చేసేందుకు, చంద్రుని లోగుట్టు తెలుసుకునేందుకు ప్రయాణించింది చంద్రయాన్‌-3. లాండర్‌ విక్రమ్‌ చేసిన ఈ ప్రయాణంలో అసోసియేట్లుగా, డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్లగా, ప్రాజెక్టు మేనేజర్లుగా వివిధ విభాగాల్లో 54 మంది మహిళా శాస్త్రవేత్తలు సేవలు అందించడం నిజంగా గర్వకారణం. ఒకపక్క కుటుంబాన్ని చూసుకుంటూనే.. మరోపక్క విశ్వ రహస్యాలు ఛేదిస్తున్న ఆ మహిళల్లో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

kalpana


                                                                              కల్పన కె

మన రాష్ట్రం చిత్తూరుకి చెందిన కల్పన కె, చంద్రయాన్‌-3 మిషన్‌లో కీలక భూమిక పోషించారు. 2003లో ఇస్రో సైంటిస్ట్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన కల్పన మొదట్లో శాటిలైట్‌ ప్రాజెక్టులకు పనిచేశారు. అక్కడ ఎన్నో ప్రాజెక్టుల విజయంలో ఆమె కృషి, పట్టుదల స్వల్పకాలంలోనే ఆమెను అంచెలంచెలుగా ఎదిగేలా చేసింది. 'మార్స్‌ ఆర్బిటార్‌ మిషన్‌' (మంగళయాన్‌)లో కల్పన ప్రదర్శించిన నైపుణ్యతే ఆమెను చంద్రయాన్‌-2 ప్రాజెక్టు డైరెక్టర్లలో ఒకరిగా ఎంపిక చేసింది. ఆ తరువాత చంద్రయాన్‌-3కి కూడా ప్రాజెక్టు డైరెక్టరుగా నియమితులై లాండర్‌ డిజైనింగ్‌ చేయడం, ఆప్టిమైజ్‌ చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. చంద్రయాన్‌ విజయం తరువాత 'రోజుకో కొత్త సవాల్‌తో ఇక్కడ పనిచేస్తామని చెబుతూ, ఒక్కోసారి 14 గంటలు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయ'ని ఆమె చెప్పారు. ఈ ఒక్క విషయమే వారి కఠోర శ్రమకు, వృత్తినిబద్ధతకు అద్దం పడుతోంది.

reetu

                                                                          రీతూ శ్రీవాస్తవ

'రాకెట్‌ మహిళ'గా పేరుగాంచిన రీతూ శ్రీవాస్తవ చంద్రయాన్‌-3 ప్రాజెక్టు డైరెక్టరుగా విశేష సేవలు అందించారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన రీతూ లక్నో వాసి. ఐదుగురు సంతానంలో పెద్ద కూతురుగా ఇంటి బాధ్యతలు మోసిన రీతూ ఈ స్థాయికి ఎదిగేందుకు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. డిగ్రీ చదివే సమయానికే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన రీతూపై తమ్ముళ్లు, చెల్లెళ్లు బాధ్యత పడింది. తోబుట్టువుల ఆలనాపాలనా చూసుకుంటూ చదువు సాగించిన రీతూ- 1997లో ఇస్రోలో ప్రస్థానం మొదలుపెట్టారు. 'చంద్రుడు రోజు రోజుకూ పెరుగుతూ, తగ్గుతూ ఉంటాడు. ఎందుకు?, 'సన్నగా ఉన్న చంద్రుడిలో మిగిలిన భాగం ఎక్కడికి వెళుతుంది? 'ఆకాశంలో ఒక రోజు కనిపించిన చుక్కలు మరో రోజు కనిపించవేంటి? 'ఆ చీకటిలో ఏం ఉంటాయి?' వంటి బాల్యంలో ఎదురైన ఎన్నో ప్రశ్నలు రీతూని శాస్త్రవేత్తగా ఎదిగేలా చేశాయి. ఇస్రోలో చేరిన తొలినాళ్లల్లో ఆపరేషన్‌ డైరెక్టర్‌గా వివిధ ప్రాజెక్టులకు పనిచేశారు. తన పరిశోధనలను ప్రచురించడంలో కూడా రీతూ ఎప్పుడూ ముందుంటారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా జాతీయంగా, అంతర్జాతీయంగా 20 వరకు పరిశోధనలను రచనల రూపంలో తీసుకువచ్చారు. అంతరిక్ష పరిశోధనా రంగానికి ఈ రచనలు ఎంతో దోహదం చేశాయి. రీతూ ప్రతిభ గురించి ఆమెకు వరించిన అవార్డులే చెబుతాయి. భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్‌ కలామ్‌ చేతులమీదుగా 'ఇస్రో యువ శాస్త్రవేత్త' అవార్డు, 2015లో 'మామ్‌' అవార్డు, 'ఎఎస్‌ఐ టీమ్‌ అవార్డు', 2017లో 'ఉమెన్‌ అచీవర్‌ ఇన్‌ ఏరోస్పేస్‌' అవార్డులు ఆమె సొంతం చేసుకున్నారు.

554

                                                                             మౌమితా దుత్తా

అహ్మదాబాద్‌ స్పేస్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న మౌమితా ఆప్టికల్‌, ఇన్‌ఫ్రారెడ్‌ (ఐఆర్‌), సెన్సార్లు, పేలోడ్‌ డెవలప్‌మెంట్‌, టెస్టింగ్‌ కెమెరాలు, ఇమేజింగ్‌ స్పెక్ట్రోమీటర్‌ డొమైన్‌లో ప్రత్యేక నైపుణ్యం కలిగి వున్నారు. 'మామ్‌'లో ఆమె ఐదు ప్రతిష్టాత్మక విభాగాల్లో కీలకపాత్ర పోషించారు.

044

                                                                            అనురాధ టికె

1982 నుండి ఇస్రోలో సేవలు అందిస్తున్న సీనియర్‌ శాస్త్రవేత్త అనురాధ. ఇస్రో శాటిలైట్‌ ప్రాజెక్టు డైరెక్టరుగా ఎన్నికైన మొట్టమొదటి మహిళగా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. జి సాట్‌-12, జి సాట్‌-10 శాటిలైట్ల విజయవంత ప్రయాణంలో అనురాధ పాత్ర ఎంతో ఉంది.
 

553

                                                                              ముత్తయ్య వనిత

చెన్నైకి చెందిన వనిత ఇస్రోలో జూనియర్‌ ఇంజినీర్‌గా ప్రస్థానం ప్రారంభించారు. ప్రాజెక్టు డైరెక్టరుగా ఉన్న వనిత 2006లో ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు. 'చంద్రయాన్‌-2' ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా అవకాశం వచ్చినప్పుడు. మొదట్లో సందేహించాను. కానీ తరువాత దాన్ని సవాల్‌గా తీసుకున్నాను. జీవితం మన మీద సవాళ్ళు విసిరినప్పుడు, వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను కూడా అదే ఇస్తుంది. ఆ సవాల్‌ను నేను ఎంతగానో ఆస్వాదించాను' అని ఓ సందర్భంలో ఆమె చెప్పారు. 'చంద్రయాన్‌-3'లో ఆమె కీలక పాత్ర పోషించారు. 2006లో అస్ట్రనామికల్‌ సొసైటీ నుంచి బెస్ట్‌ ఉమన్‌ సైంటిస్ట్‌ అవార్డుతో సహా పలు పురస్కారాలను అందుకున్న ఆమె 'నాకు వంట పని ఇష్టం. కేక్స్‌ చేస్తాను, కొత్త కొత్త వంటకాలు ట్రై చేస్తాను. పూల మొక్కలతో పాటు, అల్లం, కొత్తిమీర లాంటివి పెంచుతూ ఉంటాను' అంటూ తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతున్నప్పుడు ఓ సాధారణ గృహిణి ఆమెలో కనపడుతోంది.

88

                                                                            నందినీ హరినాథ్‌

శాస్త్రవేత్తగా, ఇంజినీర్‌గా నందిని వివిధ విభాగాల్లో ఇస్రోలో సేవలు అందించారు. మంగళయాన్‌ మిషన్‌లో కీలకభూమిక పోషించిన ఆమె తాజా ప్రాజెక్టులో కూడా విశేష సేవలు అందించారు. ఇంకా మినాల్‌ రోహిత్‌, విఆర్‌ లలితాంబికా వంటి మహిళా శాస్త్రవేత్తలు ఇస్రో తొలినాళ్ల నుండి విధులు నిర్వహిస్తున్నారు.
          'మహిళలు ఎక్కువ కష్టపడలేరు. పరిమిత గంటల్లోనే పనిచేయగలరు. ఇంటికే ప్రాధాన్యత ఇస్తారు. అంకిత భావం ఉండదు' వంటి తప్పుడు భావనలకి ఈ మహిళలు చరమగీతం పాడారు. సైన్సు రంగంలో మహిళల భాగస్వామ్యం అంతగా లేని ఆ రోజుల్లో ఈ మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎన్నో ఉండే ఉంటాయి.. అయినా వాటన్నింటినీ ఎదుర్కొని వీరు సాగించిన ఈ ప్రయాణం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఒకప్పుడు ఇస్రోలో పదుల సంఖ్యలో కూడా లేని మహిళల భాగస్వామ్యం ఇప్పుడు ఆశించిన స్థాయికి చేరుకుంటోంది. వారిలో యువ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. వీరు సాధిస్తున్న ఈ విజయాలు మున్ముందు మరిన్ని విజయకేతనాలు ఎగురవేస్తాయనడంలో సందేహం లేదు.