
ఎందుకో ఈ పూట అన్నం
సయించటం లేదు
గిన్నెలో తెల్లని మల్లెపూల
మెతుకులు
రక్తం రంగులోకి మారిపోతుంటే
గుండె కంపనంతో పగుళ్లు దీరుతోంది!
కంచంలో అన్నానికి బదులు
రాకెట్ లాంచర్లు.. మోర్టార్లు
మెషిన్ గన్లు.. క్షిపణీ పొగ బాంబులు
చేతికి తగుల్తున్నాయి
గటగటమని నీళ్లు తాగుదామన్నా సరే
యుద్ధం యుద్ధమనే అరుపులు
గొంతుకు అడ్డుపడి
దాడి చేసి చంపుతున్నాయి
ఏ దేశమైనా సరే యుద్ధ శిబిరాల్లో
ఆడవాళ్లే బలి పశువులవ్వాలా?
పసిపిల్లల మెదళ్లే పేలిపోవాలా?
నువ్ ఇశ్రాయేలీయుడవైతే ఏంటి
పాలస్తీనా పౌరుడవైతే ఏంటి
చంపేది.. చంపుతున్నది.. చచ్చేది
ఆ మనిషే కదా.. జీవ వాయువూదిన
దేవుడు పోలికని.. పోల్చుకున్నది నువ్వే కదా!
అది గాజుల్లా భళ్ళున నేలరాలిన
గాజా కావొచ్చు.. వెస్ట్ బేంక్ డోమ్ విరిగి పడొచ్చు
నడుస్తున్న దేహాలు తూట్లు తూట్లు పడి
రక్తం స్రవించే ప్రభు అంగీలై గాంచి
మీ చేతి గాయాల్లో వేలు పెట్టి చూసి
పశ్చాత్తాపంతో దు:ఖించే
పేతుర్లు ఎవ్వరూ ఉండరిక్కడ !
జాగా ఇవ్వని శపించబడ్డ
భూమి అవ్వొచ్చు
మసీదుల ప్రాకారాలు..
ప్రార్ధనాలయ బంగారు గోపురాలు
జన సమ్మర్ధన రోడ్లు
మాల్సు.. హాల్సు..
భగ్గున మండి నల్లని మసిపొగల్లో
శరీరాలు తెగి ఎగిరిపడుతుంటే
ఆకాశపు ధ్వనులు..
మరణ లేఖల్ని వినిపిస్తుంటే
నా మనిషితనం.. ఏ మతం మీదైనా
తిరగబడమని చెబుతుంది
రక్తపాతమే మతం అభిమతమైతే
మనుషుల చావులతోనే దాని ఆకలి తీరుతుందనేది
నిజమైతే..
ఆ మతం పులిని మట్టుబెట్టడానికి
ఆ దేవుణ్ణి శిక్షించే తీరతాను !
- నేలపూరి రత్నాజీ
89199 98753