Jun 23,2023 10:15

సర్పంచ్‌ ఇంటి పక్కనే..
ఊరి సర్పంచ్‌ ఇంటి పక్కనే ఈ ఘటన జరిగింది. రోజంతా వాళ్లను అలా కొడుతున్నా అతడు దాడిని ఆపలేదు.
                                                                                                                  - అశోక్‌,
                                                                                                     కుల వ్యతిరేక పోరాట సమితి


(కెవిపిఎస్‌) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు. ఊళ్లో కోళ్లన్నీ తెగులొచ్చి చచ్చిపోతున్నాయి. మేకలు, గొర్రెలు కూడా మేత మేయడం లేదు.. బర్రెలు పాలివ్వడం లేదు.. ఇళ్లల్లో పిల్లలకి, పెద్దలకీ ఏదో ఒక సుస్తీ చేస్తోంది. ఊళ్లో ఒకాయన ఉన్నట్లుండి చనిపోయాడు. ఏ రోగమూ రొష్టు లేదు.. అయినా ఎందుకిలా జరుగుతోంది? ఇక ఆలస్యం చేయకూడదు.. అనుకుంటూ ఊరంతా ఒక్కటయ్యారు. 'మన ఊరికి ఎవరో చేతబడి చేశారు..' అన్నారొకరు. ఎవరై ఉంటారు? ఆరా తీశారు మరొకరు. 'ఇంకెవరు ఊరి చివర గుడిసెలో ఉన్న యాదయ్య, అమృతే ఈ పని చేశారు' అంటూ దోషులెవరో నిర్ధారించేశారు ఇంకొకరు. అలా ఊరందరూ ఏకమై ఆ దంపతుల ఇంటికి వెళ్లి నానా దుర్భాషలాడుతూ వారిని రోడ్డుమీదకి ఈడ్చుకొచ్చారు. కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి ఊరి మధ్యలో చెట్టుకు నిట్టనిలువునా వేలాడదీశారు. గంట, రెండు గంటలు కాదు.. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వారు అలా గాల్లో ఊగులాడుతూనే ఉన్నారు.
            ఈ సమయంలో గ్రామస్తులంతా వారిపై కర్రలతో మోదారు. రాళ్లు విసిరారు. చేతబడి చేశారన్న నెపంతో అమాయకులను, నిరక్షరాస్యులను రోజంతా ఇలా హింసించింది ఎక్కడో కాదు.. మన పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలోనే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొలుకు గ్రామంలో జూన్‌ 17న జరిగిందా దారుణం.
           'వాళ్లు మమ్మల్ని ఏమీ అడగలేదు.. ఒప్పుకోండని కొడుతూనే ఉన్నారు. రక్తం కారుతున్నా మమ్మల్ని కిందకి దించలేదు. అంతసేపు అలా గాల్లో ఊగుతూనే ఉన్నాం. చాలా భయమేసింది' అంటూ అమృత (35) ఆ ఘటన గురించి చెబుతున్నప్పుడు ఆ మాటల్లో వణుకు స్పష్టంగా కనిపిస్తోంది. 'శనివారం తెల్లవారుజామునే వారు మా ఇంటికి వచ్చారు. మేము చేతబడి చేశామని, ఒప్పుకోండని కొట్టారు. ఆ తరువాత పంచాయతీ ఆఫీసుకు తీసుకువచ్చారు. అక్కడ మాతో పాటు ఊళ్లోనే ఉంటున్న శ్యామలమ్మను కూడా చెట్టుకు కట్టేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మా మీద కర్రలతో, రాళ్లతో దాడి చేస్తూనే ఉన్నారు. పోలీసులు వచ్చిన తరువాతే ఆ హింస ముగిసింది' అని జీర గొంతుతో అమృత భర్త యాదయ్య (40) చెబుతున్నాడు.
          'మేము ఏ మంత్ర విద్య చేయడం లేదని ఎంత చెప్పినా వాళ్లు ఒప్పుకోలేదు. పైగా ఒప్పుకోకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తామన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో.. నొప్పి భరించలేక చేతబడి చేశామని ఒప్పుకున్నాం' అంటున్న అమృత 'మేము ఎస్‌సి కమ్యూనిటీకి చెందిన వాళ్లం. ఊళ్లో ఏ అశుభం జరిగినా ఊరందరి చూపు మాలాంటి వాళ్ల ఇళ్ల వైపే ఉంటుంది. ఎప్పుడో ఊళ్లో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం శ్యామలమ్మ మంత్రవిద్యేనని నెపం వేసి ఇప్పటికీ ఆమెపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మేం బలయ్యాం' అంటోంది.
 

                                                                    ఎందుకు రావడం లేదనీ కొట్టారు..

ఈ ఘటనకు దారితీసిన మరో విషయమేమంటే అమృత దంపతులు కొంతకాలంగా ప్రార్థనాలయానికి వెళ్లడం లేదు. వారికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు డౌన్‌సిండ్రోమ్‌తో బాధపడుతోంది. 'ఒకరోజు ప్రార్థనాలయంలో మా పెద్ద పాప బట్టలు తడుపుకుంది. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. అది జరిగిన నాటినుండి మేం అక్కడికి వెళ్లడం లేదు. ఆ రోజు మమ్మల్ని చెట్టుకు కట్టేసి కొట్టినప్పుడు మేం ప్రార్థనాలయానికి ఎందుకు రావడం లేదని కూడా అడిగారు. మేం ఏం సమాధానం చెప్పగలం? మా పిల్ల విషయం బయటికి చెప్పలేం కదా? అవేమీ పట్టించుకోకుండా వాళ్లు మమ్మల్ని తిడుతూ పదే పదే కొట్టారు' అంటున్నాడు యాదయ్య.
 

                                                                    పెద్దలంతా తప్పించుకున్నారు..

'ఆ రోజు దాడి చేసిన వారిలో కొంతమందిని అరెస్టు చేయలేదు. వారంతా పెద్ద కులస్తులు.. ఆ కారణంగానే ఎఫ్‌ఐఆర్‌లో వారి పేర్లను కూడా నమోదు చేయలేదు' అంటూ కలెక్టరు కార్యాలయంలో తాను చెప్పిన 8 మంది వ్యక్తులలో కొందరిపైనే కేసు నమోదైందని చెబుతున్నాడు యాదయ్య.
ఈ ఘటనలో దోషులెవరు.. నిర్దోషులెవరు.. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన తేవడంతో పాటు పాలకులు, అధికారులు పటిష్ట చర్యలు చేపట్టకుంటే బాధితులకు న్యాయం జరగదు.

                                                                    తెలియకుండా ఎలా ఉంటుంది ?

ఇంత పెద్ద ఎత్తున సంఘటన జరిగితే ఊళ్లో ఉన్న సర్పంచ్‌కి లేదా మండల రెవిన్యూ అధికారి (ఎంఆర్‌ఒ)కి విషయం తెలియకుండా ఎలా ఉంటుంది? ఇలాంటి సందర్భాల్లో గ్రామ రాజకీయాలు కూడా కీలకంగా పనిచేస్తాయి. కోళ్లు చచ్చిపోయినా అణగారిన కులస్తులపై ఆధిపత్య కులాల వారు మంత్రవిద్య నెపంతో దాడి చేస్తారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిపై నింద పడినప్పుడు మిగిలిన వ్యక్తులు తాము ఆ నేరంలో భాగం కాలేదని నిరూపించుకోవాలి. లేనిపక్షంలో వారంతా శిక్షార్హులే.. మూఢనమ్మకాల పేరుతో గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. స్థానిక పాలకులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుంటారు.
                                                        - మురళీ కర్నమ్‌,
           జాతీయ అకాడెమీ లీగల్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌(ఎన్‌ఎఎల్‌ఎస్‌ఎఆర్‌) యూనివర్శిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, హైద్రాబాద్‌.

                                                                         పదేళ్లలో 300 కేసులు..

జార్ఖండ్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో ఇటువంటి సంఘటనలు జరిగినట్లు వార్తల్లో వింటుంటాం. కాని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంఘటనలు సర్వసాధారణం. గడిచిన పదేళ్లలో మంత్రగత్తెల నెపంతో దాడులు చేసినవి 300 కేసులు వెలుగు చూశాయి. వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాలు, మహిళలే ఈ దాడులకు కేంద్ర బిందువులుగా ఉంటారు. సమస్యను పరిష్కరించే పటిష్ట చట్టాలు లేనందున ఇటువంటి మూఢ నమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
         ప్రతి సంవత్సరం 20కి పైగా కేసులు తెలంగాణలో వెలుగు చూస్తున్నాయి. బాధితులంతా దళితులు, రజకులు, వడ్డెర కమ్యూనిటీకి చెందిన వారే ఉంటున్నారు. 2019లో వికారాబాద్‌కు చెందిన ఓ యువతి అనారోగ్య సమస్యతో బాధపడుతూ దాన్నుండి బయటపడాలంటే నిప్పుల్లో నడిస్తే సరిపోతుందని ఎవరో చెప్పారని అలాగే చేసింది. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట వినపడుతూనే ఉంటాయి. ఇలాంటి సంఘటనల్లో ఎవరికి వారే ప్రాణాల మీదికి తెచ్చుకోవడమో.. ఇతరుల ప్రాణాలు తీయడమో జరుగుతుంది. అలాగే మంత్రవిద్య చేస్తున్నారని నెపం వేసిన వారు తమ నిజాయతీనీ నిరూపించుకునేందుకు కఠిన పరీక్షలు ఎదుర్కొంటుంటారు. వాటిల్లో విఫలమైతే వారు నేరం చేసినట్లుగా పరిగణించి శిక్షలు అనుభవించాల్సిదేనని హుకుం జారీచేస్తారు. ఇక్కడ పోలీసులు, కోర్టులు, చట్టాలు ఏవీ పనిచేయవు. ప్రజలను అవగాహన పరిచేందుకు స్వచ్ఛంద సంస్థలు ఒకపక్క ప్రయత్నాలు చేస్తున్నా మరోపక్క ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఘటనలు జరిగినప్పుడు హడావిడి చేసే అధికారులు కొంత కాలానికి స్తబ్దత పాటిస్తారు.
         మంత్ర విద్య చేస్తున్నారన్న ఒక్క అనుమానం ఆ ప్రజలను లక్ష్యం చేసుకోవడానికి సరిపోతుంది. మూఢనమ్మకాలను నిరోధించే ఎటువంటి చట్టం లేకుండా, ప్రభుత్వ జోక్యం లేకుండా ఈ సమస్యలు పరిష్కారమవ్వవు. స్వయం ప్రకటిత దేవుళ్ళను ప్రోత్సహించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోకపోతే సమస్య ఇంకా తీవ్రమవుతుంది.
                                              - రమేష్‌బాబు,
                                   జనవిజ్ఞాన వేదిక, తెలంగాణ