న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన టెక్ మహీంద్రా కంపెనీలో చేరనున్నారని సమాచారం. మహీంద్ర కంపెనీకి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులు కానున్నారని తెలుస్తోంది. మోహిత్ తన పదవికి రాజీనామా చేసినట్లు ఇన్ఫోసిస్ కంపెనీ శనివారం వెల్లడించింది. మోహిత్ శనివారం మార్చి 11వ తేదీ నుండి సెలవులో ఉంటారని జూన్ 9వ తేదీ ఆయన కంపెనీలో ఉండే చివరి తేదీ అని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మోహిత్ జోషి అందించిన సేవలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అతన్ని ప్రశంసించారని ఆ కంపెనీ ప్రకటనలో పేర్కొంది.
కాగా, మోహిత్ జోషి ఇన్ఫోసిస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ బిజినెస్‌లకు జోషి బాధ్యత వహించారు. ఈ బాధ్యతలే కాకుండా ఆయన అదనంగా అడ్జెవెర్వ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా, ఇన్ఫోసిస్ గ్లోబల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌తో కూడిన సాఫ్ట్‌వేర్ వ్యాపారానికి ఆయన నాయకత్వం వహించారు. సేల్స్ ఆపరేషన్స్‌కి బిగ్ డీల్స్‌కి ఆయన ఎఫెక్టివ్‌గా పనిచేయడమేగాక ఇన్ఫోసిస్ కంపెనీ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. మోహిత్ 2000లో ఇన్ఫోసిస్‌లో చేరారు. ఆయన ఆ కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన 2007లో ఇన్ఫోసిస్ సిఇఓగా నియమితులయ్యారు. ఈయన ఇన్ఫోసిస్ కంపెనీలకు మాత్రమే కాదు.. మరికొన్ని కంపెనీల్లో కూడా కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఆయన ప్రస్తుతం అవైవా పిఎల్‌సి అనే లండన్ బీమా కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. అలాగే రిస్క్ అండ్ గవర్నెన్స్ నామినేషన్ కమిటీలో సభ్యునిగా ఉన్నారు. మోహిత్ 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గ్లోబల్ యంగ్ లీడర్‌గా ఆహ్వానించబడ్డాడు. ఇక సిబిఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండ్రస్టీ) ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ ఛైర్మన్‌గా, ఐపిఓ (యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్)లో సభ్యునిగా ఉన్నారు. మోహిత్ గతంలో ఎబిన్, ఎఎంఆర్‌ఓ, ఎఎన్‌జెడ్ గ్రైండ్‌లేస్ వంటి కార్పొరేట్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్‌లో పనిచేశారు. ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో ఎంబిఎ, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.










