- మల్టీపర్పస్ ఉద్దేశం ఇదే
- వాటర్ బాట్లింగ్ నుంచి బడ్డీకొట్ల వరకు అనుమతి
- సూపర్‌బజార్లు, మెడికల్ షాపులు, పెట్రోల్ బంక్‌లు సైతం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పిఎసిఎస్/ప్యాక్స్) ఇప్పటి వరకు రైతులకు అవసరమైన వ్యవసాయ సంబంధ కార్యకలాపాలు నిర్వహించగా, ఇకపై సాగేతర వ్యాపార కేంద్రాలుగా మారనున్నాయి. తాగునీటిని శుద్ధి చేసే ఆర్‌ఒ ప్లాంట్లు, మంచినీటి బాట్లింగ్ ప్లాంట్లు, జనరిక్ ఔషధ కేంద్రాలు, అన్ని రకాల పచారీ, ఇతర వస్తువులు అమ్మే సూపర్ బజార్లు, బడ్డీకొట్లు, సామిల్లులు, కార్పెంటరీ, కాటన్ జిన్నింగ్, పెట్రోల్ బంక్‌లు, ఇత్యాది వ్యాపారాలను సహకార సొసైటీలలో అనుమతించారు. పంట రుణాలతో పాటు వెహికిల్ లోన్లు (కిసాన్ బైక్స్), పర్సనల్ లోన్లు, ఆభరణాలపై రుణాల వంటి వాటికీ సై అన్నారు. పిఎసిఎస్‌లు స్వయం సమృద్ధి సాధించాలంటే వ్యవసాయేతర వ్యాపారాలు చేయక తప్పదని నిర్దేశించారు. ఇప్పటి వరకు ప్యాక్స్‌్ లేని పంచాయతీల్లో ప్యాక్స్‌్‌ను నెలకొల్పుతామని మొన్న బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పిఎసిఎస్‌లను బహుళ సేవా కేంద్రాలు (మల్టీపర్పస్ సర్వీస్ సెంటర్స్-ఎంఎస్‌సి)గా తీర్చిదిద్దుతామని, సొసైటీల్లో 25 రకాల వ్యాపారాలు నిర్వహించేలా మోడల్ బైలాస్‌ను రూపొందించింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం పిఎసిఎస్‌లను రైతు భరోసా కేంద్రాలతో లింక్ చేసి బహుళ ప్రయోజన సేవ కేంద్రాల (ఎంపిఎఫ్‌సి)ను నిర్మిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సొసైటీలను బిజినెస్ సెంటర్లుగా మారుస్తున్నాయి.
ఆప్కాబ్‌లో ప్రత్యేక విభాగం
ఆప్కాబ్‌లో 2013లోనే ప్యాక్స్‌్-ఎంఎస్‌సి కార్యాచరణకు నాబార్డు నేతృత్వంలో ప్రత్యేక విభాగం ప్రారంభమైంది. ఇప్పుడు ఆ డిపార్ట్‌మెంట్ పనులు ఊపందుకున్నాయి. ఆ విబాగం నాబార్డు, ఆప్కాబ్ సమన్వయంతో పని చేస్తుంది. పిఎసిఎస్‌లను మల్టీ సర్వీస్ కేంద్రాల వైపు తీసుకురావడం, అందుకు అవసరమైన రుణాలపై అంచనా వేసి ఆప్కాబ్ ద్వారా నాబార్డుకు రుణం కోసం సిఫారసులు పంపడం ప్రాజెక్టు మోనెటరింగ్ యూనిట్ (పిఎంయు) పని. రాష్ట్రంలో 2 వేలకు పైన ప్యాక్స్ ఉండగా 238 ప్యాక్స్‌ను మల్టీ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించారు. ప్యాక్స్‌్, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఎంఎంసి) భూములను సేకరించి నిర్మాణాలు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపడుతున్నారు. గోదాములు, డ్రయ్యర్ యార్డ్‌తోపాటు అనుమతించిన వ్యాపారాలకు అనుగుణంగా నిర్మాణాలు చేస్తున్నారు.
అంతా రుణమే
మల్టీపర్పస్ సెంటర్ల నిర్మాణానికి అవసరమైన వ్యయంలో ప్రధానంగా రుణమే ఉంది. రెండు కాంపొనెంట్‌లలో నాబార్డు, ఆప్కాబ్ నుంచి పిఎసిఎస్‌లకు లోన్ అందుతుంది. ఒకటి టర్మ్‌లోన్ కాగా రెండవది వర్కింగ్ క్యాపిటల్ లోన్. టర్మ్‌లోన్‌ను ఐదు నుంచి ఏడేళ్లల్లో సొసైటీ చెల్లించాలి. వర్కింగ్ క్యాపిటల్ లోన్‌ను మూడేళ్లల్లో చెల్లించాలి. సెంటర్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో రుణం పోను కొంత మొత్తం సొసైటీ భరించాలి. కాగా సొసైటీల్లో ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, వ్యవసాయ రుణాలు ఇవ్వడం కద్దు. వ్యవసాయ యంత్రాలను అద్దెకిచ్చేందుకు కస్టమ్ హైర్ సెంటర్ల కోసం రుణాలివ్వడం వరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ సాగేతర బిజినెస్‌కు అనుమతించడం కార్పొరేట్, ప్రైవేటు కోసమే. ప్యాక్స్ రుణం తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రైవేటు కంపెనీలు వాటిని అప్పనంగా వినియోగించుకొని తమ వ్యాపారం చేసుకుంటాయి.










