Jan 27,2023 21:06
  • స్థూల ఎఫ్‌పిఐల్లోనూ పతనం
  • చైనా వైపు మొగ్గు

ముంబయి : గడిచిన ఏడాదిలో భారత మార్కెట్లోకి విదేశీ పోర్టు పోలియోలోని దీర్ఘకాలిక వనరుల్లో కీలకమైన పెన్షన్‌ ఫండ్స్‌ రాక భారీగా తగ్గింది. గతేడాది ఈ ఆస్తులు దాదాపు 13.3 శాతం లేదా రూ.57,242 కోట్లు తగ్గి రూ.3.7 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. ఇంతక్రితం ఏడాది 2021లో ఇవి రూ.4.3 లక్షల కోట్లుగా నమోదయ్యాయని డిపాసిటరీ డాటా విశ్లేషించింది. చైనా ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకోవడంతో ఎఫ్‌ఐఐలు ఆ దేశానికి తరలిపోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది భారత్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పిఐ) స్థూల ఈక్విటీ పెట్టుబడులు 0.5 శాతం తగ్గి రూ.48.6 లక్షల కోట్ల నుంచి రూ.48.3 లక్షల కోట్లకు పడిపోయాయి. ఇదే సమయంలో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 4.4 శాతం పెరిగింది. 2022 ప్రథమార్థంలో భారీగా ఎఫ్‌పిఐలు తరలిపోయాయని సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌, ఇతర గ్లోబల్‌ ఇన్స్‌ట్యూషన్లకు ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌, అడ్వైజరీ సర్వీస్‌ను అందించే ముంబయికి చెందిన కర్మ కాపిటల్‌ సిఇఒ రజ్నీష్‌ గిర్దర్‌ పేర్కొన్నారు.
      '' గతేడాది జులై నుంచి తిరిగి భారత్‌కు ఎఫ్‌పిఐలు భారీగా వచ్చాయి. డిసెంబర్‌ చివరి రెండు వారాల వరకు ఇది కొనసాగింది. ఆ తర్వాత మళ్లీ తరలిపోవడం ప్రారంభించాయి. జనవరిలోనూ ఇదే కొనసాగింది. ద్వితీయార్థంలో చైనాపై కొంత ప్రతికూలత ఉండటంతో భారత్‌కు నిధుల రాక ఎక్కువగా ఉంది. ఇటీవల పరిస్థితులు మారడంతో తిరిగి మళ్లీ ఆ దేశం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.'' అని రజ్నీష్‌ పేర్కొన్నారు. భారత్‌పై విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు గతంలో ఉన్నంత ఎక్కువగా ఉండకపోవచ్చని.. చాలా వరకు చైనాపై ఆధారపడి ఉండవచ్చని ఇండిపెండెంట్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ ఆనంద్‌ టాండన్‌ పేర్కొన్నారు. 2022లో విదేశీ పోర్టుపోలియో ఇన్వెస్టర్లు రూ.1.25 లక్షల కోట్ల నికర అమ్మకాలు చేపట్టారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.2.8 లక్షల కోట్ల నికర కొనుగోళ్లు చేశారు. కాగా.. జనవరిలో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.13,000 కోట్ల విలువైన స్టాక్‌లను విక్రయించగా.. దేశీయ సంస్థలు రూ.19,000 కోట్లకు పైగా కొనుగోలు చేశాయి.