- వేరుశనగ విత్తన నాణ్యత ప్రశ్నార్థకం
- అంతా ట్రూత్‌ఫుల్ సీడ్
- ఆఫ్‌లైన్ పంపిణీకీ వెసులుబాటు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రానున్న ఖరీఫ్‌లో రైతులకు ప్రభుత్వం పంపిణీ చేయతలపెట్టిన సబ్సిడీ వేరుశనగ విత్తనాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. విత్తనాల సేకరణ ప్రక్రియను వీలైన మేరకు ఆలస్యం చేసి, చివరి నిమిషంలో హడావుడి పడి, ఇదే అదనుగా నాణ్యతాప్రమాణాలు పాటించకుండా నాసిరకం విత్తనాలను రైతులకు అంటగట్టే ఎత్తుగడ అమలు చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. సేకరణ టెండర్ల దగ్గరే విపరీతమైన జాప్యం జరిగింది. దాంతో మే మూడవ వారం వచ్చినా లక్ష్యంలో 40 శాతంలోపే సేకరించారని తెలుస్తోంది. ప్రాసెస్ దశలో ఉన్నట్లు చెబుతున్నారు. మామూలుగా మార్చి, ఏప్రిల్‌లో విత్తనాల సేకరణ తతంగం మొదలవుతుంది. మే రెండో వారానికల్లా సేకరణ పూర్తి చేసి, మూడవ వారంలో పంపిణీ ప్రారంభించేవారు. ముందటేడు వరకు అలాగే చేశారు. నిరుడు మే చివరిలో పంపిణీ మొదలు పెట్టారు. ఈ తడవ సైతం అదే తంతు రిపీట్ అవుతోంది. మే 29న లాంఛనంగా విత్తన పంపిణీని ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రారంభించాలనుకుంటున్నారు. సాధారణంగా తొలకరి వానలు రాగానే విత్తుతారు. అదనుకు విత్తనం అందుబాటులో లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
నిబంధనల సడలింపు
ముందటేడు వరకు 'రైతు నుంచి రైతుకు' కాన్సెప్టుతో నేరుగా వ్యవసాయశాఖ ద్వారా రైతుల నుంచి విత్తనకాయలను సేకరించి, ఎపి సీడ్స్‌తో ప్రాసెసింగ్ చేయించి అందించారు. టార్గెట్‌లో కొంత భాగాన్నే టెండర్ల ద్వారా ట్రేడర్ల నుంచి సేకరించారు. నిరుడు, ఈయేడు మొత్తానికీ టెండర్ల ద్వారా వ్యాపారుల నుంచి సేకరిస్తున్నారు. వ్యాపారులు నాణ్యతాప్రమాణాలు పాటించకుండా బహిరంగ మార్కెట్‌లో ఖరీఫ్ పంటను తక్కువ ధరకు కొని వాటినే కొద్దిగా ప్రాసెస్ చేసి ఎపి సీడ్స్‌కు సరఫరా చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వంద గ్రాముల విత్తన కాయల నుంచి తాలుతప్ప పోను కనీసం 70 గ్రాముల గింజలు రావాలి. ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు. ధ్రువీకరణ విత్తనాలే ఇవ్వాల్సి ఉండగా మొత్తం ట్రూత్‌ఫుల్ సేకరిస్తున్నారు. సర్టిఫైడ్ సీడ్‌పై వ్యవసాయశాఖ నియంత్రణ ఉంటుంది. ట్రూత్‌ఫుల్‌కు అదేమీ పెద్దగా ఉండదు. ట్రేడర్లు నాసిరకం విత్తనాలను అంటగట్టడానికి 'ట్రూత్‌ఫుల్' బాగా ఉపయోగపడుతుంది. రైతు భరోసా కేంద్రాల్లో డి-క్రిషి యాప్ ద్వారా సబ్సిడీ విత్తనాలివ్వాలని, సర్కారీ సబ్సిడీ మినహాయించి మిగతా అమౌంట్‌ను రైతులు ముందే చెల్లించాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో కూడా విత్తనాలిస్తామంటున్నారు. ఆఫ్‌లైన్ అనడంతో పంపిణీ లెక్కలు తారుమారయ్యే అవకాశం ఉంది.
అసలే కోతలు
రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీ లక్ష్యాలు రానురాను తగ్గిపోతున్నాయి. ముందటేడు టార్గెట్ నాలుగున్నర లక్షల క్వింటాళ్లుకాగా నిరుడు మూడున్నర లక్షల క్వింటాళ్లు. అవీ మొత్తం పంపిణీ చేయలేదు. ఈసారి లక్ష్యం 2.92 లక్షల క్వింటాళ్లకు తగ్గించారు. వేరుశనగ ఎక్కువగా సాగు చేసే ఉమ్మడి అనంతపురం జిల్లాకు 1.88 లక్షల క్వింటాళ్లు టార్గెట్‌గా నిర్ణయించారు. మిగతా జిల్లాలకు మరో లక్ష క్వింటాళ్లు ఇస్తామంటున్నారు.










