Jul 26,2023 15:30

అమరావతి : పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడనం కొనసాగుతుండడంతో ఏపీలోని పలు జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు బుధవారం జారి ఘాట్‌రోడ్‌ మీద పడ్డాయి . ముందు జాగ్రత్త చర్యగా ఇంద్రకీలాద్రి ఘట్‌రోడ్డును అధికారులు మూసివేశారు.ఉత్తర కోస్తాంధ్ర ఒడిశా తీరాన్ని ఆనుకుని బలమైన అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. అల్పపీడనానికి అనుబంధంగా రుతుపవన ద్రోణి, ఉపరితల అవర్తనం ఉందని వెల్లడించింది. దీని వల్ల కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు, రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది. రేపటి నుంచి కోస్తాంధ్ర జిల్లాలో వర్షం పడే అవకాశముందని స్పష్టం చేసింది. అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.మన్యం జిల్లాలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దేవీపట్నం మండలం సుక్కరాతి గండి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భూపతిపాలెం జలాశయం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.