ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఎంవిపి కాలనీలోని ఎఎస్ రాజా కాలేజీ గ్రౌండ్ పక్కన ఎకరా పది సెంట్లు విస్తీర్ణంలో రూ.25 కోట్లతో జీవీఎంసీ నిర్మించిన మల్టీ ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను సహానీ అనే ప్రయివేటు సంస్థకు మహా విశాఖ నగర పాలక సంస్థ (జివిఎంసి) కట్టబెట్టడాన్ని వార్వా, నివాస్ సంఘాలు వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టాయి. ప్రజల ఆస్తులను ప్రయివేటు సంస్థలకు దోచిపెట్టే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని వార్వా జోన్ 3 కార్యదర్శి కేయం.కుమార్ మంగళం డిమాండ్ చేశారు. ఇండోర్ స్పోర్ట్స్‌ను ప్రయివేటు సంస్థకు ఇవ్వకుండా, దీని నిర్వహణ బాధ్యతను జివిఎంసి చూడాలని, భారీగా విధించిన ఫీజులు రద్దు చేయాలని కోరారు. ఎరీనాను మే నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. సెంట్రల్ ఏసితో కూడిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నాలుగు బ్యాడ్మింటెన్ కోర్టులు, 2 స్విమ్మింగ్ పూల్స్, బాస్కెట్‌బాల్ కోర్టులు, వాలీబాల్ కోర్టు, 2 టేబుల్ టెన్నీస్ కోర్టులు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, డార్మెంటరీస్, బోర్డు గేమ్ రూమ్స్ తదితర అనేక రకాల క్రీడా సదుపాయాలున్నాయి. ఇన్ని సదుపాయాలు కలిగిన ఎరీనాను ప్రజలు వినియోగించుకొనే అవకాశం లేకుండా, ప్రయివేటు సంస్థకు జివిఎంపి, ప్రభుత్వం అప్పగించింది.
స్విమ్మింగ్‌పూల్ కు నెలకు రూ.5 వేలు, బాడ్మింటెన్‌కు రూ.5 వేలు వాలీబాల్‌కు రూ.6 వేలు, టేబుల్ టెన్నీస్‌కు రూ.2,500, చెస్‌కు రూ.1500, యోగాకు 2 వేలు, ఆదివారం రోజున బ్యాడ్మింటెన్‌కు ప్రతీ గంటకు 1000 రూపాయలు, జిమ్‌క్రాస్ ఫిట్ ట్క్రెనింగ్‌కు 8 వేలు చొప్పున ప్రయివేటు సంస్థ వసూలు చేస్తోంది. అదనంగా 18 శాతం జిఎస్‌టి చెల్లించాలి. రాబోయే కాలంలో ఈ ధరలు మరింత పెంచనుంది. ఈ ఫీజులు నిర్ణయంలోనూ, ధరల నియంత్రణలోనూ జివిఎంసికి అధికారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. విచ్చలవిడిగా డబ్బులు దోచుకొనే అవకాశం ప్రయివేటు సంస్థకు కల్పించింది. నామమాత్రంగా ఏడాదికి కేవలం కోటి నాలుగు లక్షలు మాత్రమే చెల్లించి, స్పోర్ట్స్ కాంపెక్స్‌లో క్రీడా శిక్షణ పేర అనేక వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకొనే అవకాశమిచ్చింది. ప్రజల సొమ్ముతో నిర్మించి కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చడం, డబ్బున్న కొద్దిమందికే పరిమితం చేయడం సరైంది కాదు. తక్షణమే ప్రైవేటీకరణ చర్యలు వీడకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో వార్వా జూన్ 3 అధ్యక్షులు జేపీ శర్మ, జిల్లా అధ్యక్షులు ఎన్.ప్రకాష్ రావు, పిఠాపురం కాలనీ నుండి డాక్టర్ కోరట్ల రమాప్రభ, సీతమ్మధార నుండి జీవి రమణ, ఎంవిపి సెక్టార్ సిక్స్ నుండి లక్ష్మణరావు, కోదండ, రాజు, తదితరులు పాల్గొన్నారు.










