
- ప్రతికూల వాతావరణం వల్లేనని వివరణ
న్యూఢిల్లీ : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అమృత్‌సర్ నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇండిగో అధికారి ఒకరు ఆదివారం నాడు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇండిగో 6ఇ-645 విమానం అమృత్‌సర్ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి స్వల్పకాలం పాక్ గగనతలంలోకి ప్రవేశించిన తరువాత 9.40 గంటలకు అహ్మదాబాద్ చేరినట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణ ప్రతికూలత కారణంగా అటారీ మీదుగా పాకిస్థాన్ గగనతంలోకి విమానం ప్రవేశించినట్టు పేర్కొంది. విమానం డైవర్షన్ విషయంలో అటు పాకిస్థాన్ ఎటిసి, ఇటు అమృత్‌సర్ ఎటిసి ఫోనులో వివరాలు ఇచ్చిపుచ్చుకుంటూ చక్కటి సమన్వయంతో వ్యవహరించాయని పేర్కొంది. 30 నిమిషాల అనంతరం విమానం సరైన మార్గంలోకి ప్రవేశించి సురక్షితంగా అహ్మాదాబాద్ చేరుకున్నట్టు తెలిపింది. కాగా శనివారం మరో విమానం కూడా వాతావరణ పరిస్థితుల ప్రతికూలత కారణంగా అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఢిల్లీ-చెన్నై విమానం ఒకటి గాలిలో ఉండగానే ఇంజన్‌లో లోపం తలెత్తడంతో ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు.