ప్రజాశక్తి - కవిటి : వంశధార-బహుదా నదుల అనుసంధానం (నేరడి రిజర్వాయర్) విషయంలో ఉదాసీన వైఖరి తగదని ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఇ.ఎ.ఎస్ శర్మ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలకు గురువారం లేఖలు రాశారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార-బహుదా నదుల అనుసంధానం ప్రాజెక్టు (నేరడి రిజర్వాయర్ ప్రాజెక్టు)తో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో సుమారు 2.5 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. అప్పటి టిడిపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించిందని తెలిపారు. వంశధార ట్రిబ్యునల్ అనుమతి లభించినా, వైసిపి ప్రభుత్వం ప్రాజెక్టును తిరిగి పరిశీలన కోసం వెనక్కి పంపిందన్నారు. 2019 ఫిబ్రవరి 18న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో రూ.6,342 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టు రిపోర్టులను 2020 జూన్ 30వ తేదీ లోపు ప్రభుత్వ పరిశీలనకు దాఖలు చేయాలని జలవనరుల శాఖకు ఆదేశాలు ఇచ్చినట్టు గుర్తుచేశారు. ఆ తరువాత 2021 నవంబరులో భువనేశ్వర్‌లోని ఒడిశా-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సమీక్ష సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చేసిన ఉమ్మడి ప్రకటనలో, నేరడి ప్రాజెక్టు విషయంలో తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఇంత వరకూ ప్రాజెక్టు పనులు ముందుకు పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కోసం కావలసిన 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఆంధ్రప్రదేశ్ అధికారులకు అందజేయాలని, కానీ ఈ విషయంలో ఎపి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో ఒడిశా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అన్ని జలవనరుల ప్రాజెక్టుల గురించి ఏటా బడ్జెట్ సమయంలో శాసన సభనుద్దేశించి రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రసంగం చేస్తున్నారని, కానీ, నేరడి రిజర్వాయర్ ప్రాజెక్టు గురించి ప్రస్తావించకపోవడం గమనార్హమని పేర్కొన్నారు.
రాష్ట్ర జలవనరుల శాఖ వెబ్‌సైట్‌లో నేరడి ప్రాజెక్టు పేరే కనిపించకపోవడం, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆశ్చర్యం, బాధ కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు.
సుజల స్రవంతిలో అదే తీరు..
శ్రీకాకుళం జిల్లా జలవనరుల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతతో వ్యవహరిస్తోంది అనడానికి మరో ఉదాహరణగా బాబూ జగ్‌జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల శ్రీకాకుళం జిల్లాలో 85,000 ఎకరాల భూములకు సాగునీటి సౌకర్యం కలిగే అవకాశం ఉంది. కానీ ఈ రోజూ వరకు బడ్జెట్‌లో నిధులను చేకూర్చకపోవడం కారణంగా ప్రాజెక్టు అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి, జలవనరుల ప్రాజెక్ట్‌ల మీద ఆధారపడి ఉందని, కాని ప్రభుత్వం ఇతర జిల్లాలకు ఇస్తున్న ప్రాముఖ్యత శ్రీకాకుళం జిల్లాకు ఇవ్వకపోవడం అక్కడి ప్రజలకు నిరాశ, బాధ కలిగిస్తోందని లేఖలో వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా అవసరాలను గుర్తించి, నేరడి ప్రాజెక్టు కోసం నిధులను మంజూరు చేయాలని కోరారు. అంతేకాకుండా ఆలస్యం చేయకుండా పనులు చేపడతామని ప్రకటించాలని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు నిధులను సమకూర్చి శ్రీకాకుళం ప్రాంతానికి న్యాయం చేయాలని కోరారు.