జగిరాం ఎపిఫైబర్ జ్యూట్ మిల్లును తెరిపించాలి - ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ
- కార్మికులకు ఉపాధి కల్పించాలని సూచన
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో:పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం జగిరాంలోని ఎపి ఫైబర్ జ్యూట్ మిల్లును తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. 17 నెలల క్రితం జగిరాంలో జ్యూట్ మిల్లు యాజమాన్యం అక్రమంగా లాకౌట్ ప్రకటించి 1,200 మంది కార్మికుల కుటుంబాలను రోడ్డుపాలు చేసిందని తెలిపారు. పలు దఫాలు కార్మికులు తమ ఆవేదనను మిల్లు యాజమాన్యానికి తెలియజేసినప్పటికీ మొండిగా వ్యవహరిస్తూ వచ్చిందని, పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తహశీల్దారు, పార్వతీపురం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వారి సమక్షంలో చర్చలు కోసం పిలిచినా యాజమాన్యం వైపు నుండి ఎటువంటి స్పందనా లేదని తెలిపారు. కార్మికులకు వేరే గత్యంతరం లేక 47 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేశారని, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర హామీ మేరకు దీక్షలను విరమించారని వివరించారు. హామీ ఇచ్చి రోజులు గడుస్తున్నా.. నేటికీ ఎటువంటి పరిష్కారమూ కాలేదని, కార్మికులు, వారి కుటుంబాలు ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ఎపి ఫైబర్ జ్యూట్ మిల్లును తెరిపించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సిఎంను కోరారు.