Oct 28,2023 09:05

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:జైలులో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందంటూ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎసిబి కోర్టు జడ్జికి లేఖ రాశారు. తన భద్రత, ఆరోగ్య సమస్యలపై అనుమానం వ్యక్తం చేస్తూ చంద్రబాబు బుధవారం రాసిన మూడు పేజీల లేఖను జైలు అధికారులు శుక్రవారం ఎసిబి కోర్టు జడ్జికి పంపారు. తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్‌పికి కూడా లేఖ వచ్చిందని, దానిపై ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదని వివరించారు. తనను చంపేందుకు రూ.కోట్లు చేతులు మారినట్లు తెలిసిందని పేర్కొన్నారు. జైలుకు వచ్చినప్పుడు తనను అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారని, ఆ ఫుటేజీని పోలీసులే లీక్‌ చేశారని లేఖలో వివరించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజీని రిలీజ్‌ చేశారని పేర్కొన్నారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయన్నారు. జైలులో పెన్‌ కెమెరాతో డ్రగ్స్‌ కేసు నిందితుడు తిరుగుతున్నాడని తెలిపారు. ఆ ఖైదీ జైలు లోపల ఫొటోలు తీస్తున్నాడని పేర్కొన్నారు. ఈ నెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్‌ ఎగురవేసి తన కదలికలు తెలుసుకునే ప్రయత్నం చేశారని అన్నారు. ములాఖత్‌లో తనను కలిసిన వారి చిత్రాల కోసం కూడా డ్రోన్‌ను వినియోగిస్తున్నారన్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు. జైలుపై డ్రోన్‌ ఎగురవేసింది వైసిపి వారేనని అనుమానమని లేఖలో పేర్కొన్నారు. డ్రోన్‌ ఘటన ప్రధాన సూత్రధారి ఎవరో గుర్తించలేదని, జైలు అధికారుల నిస్సహాయతకు ఇది నిదర్శనమని అన్నారు. కొందరు గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరితే గార్డెనింగ్‌ విధుల్లోని ఖైదీలు వాటిని పట్టుకున్నారన్నారు. రాజమండ్రి జైలులో మొత్తం 2,200 మంది ఖైదీలు వుంటే, అందులో 750 మంది డ్రగ్స్‌ కేసు నిందితులని వివరించారు. కొంతమంది ఖైదీల వల్ల తన భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జడ్‌ ప్లస్‌ కేటగిరి రక్షణలో ఉన్న తన భద్రతకు ఇది తీవ్రమైన ముప్పు అని లేఖలో పేర్కొన్నారు. తనకు అనారోగ్య సమస్యలు వున్నాయని మెరుగైన వైద్యసేవలు అవసరమని తెలిపారు.