Apr 15,2023 21:50

- కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు
ప్రజాశక్తి-గుంటూరు :
గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకూ పొడింపునకు సంబంధించి భూసేకరణకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఎపి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొత్త వెంకట శివరావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు పాల్గని మాట్లాడారు. గుంటూరు ఛానల్‌ విస్తరణ పట్ల ప్రభుత్వాల ఉదాసీన వైఖరి తగదని అన్నారు. నాలుగు మండలాల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీరు, 50 గ్రామాలకు తాగునీరు అందించే ఛానల్‌ విస్తరణకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాట్లాడుతూ సుదీర్ఘకాలం నుంచి రైతులు గుంటూరు ఛానల్‌ పొడిగింపునకు పోరాడుతున్నారని, ఇటీవల భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చిన ప్రభుత్వం బడ్జెట్‌లో అందుకు అవసరమైన నిధులు కేటాయించకపోవటం సరికాదన్నారు. తక్షణమే భూసేకరణకు నిధులు కేటాయించాలని కోరారు. ధర్నాలో గుంటూరు జిల్లా తెలుగు రైతు నాయకులు కళ్ళం రాజశేఖర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ నాయకులు లావు అంకమ్మ చౌదరి, వివిధ సంఘాల నాయకులు కాకుమాను నాగేశ్వరరావు, తదితరులు పాల్గని మద్దతు తెలిపారు. ధర్నా అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.