
- అభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక ఉండాలి
- అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సులో ఎమ్మెల్సీ లక్ష్మణరావు
ప్రజాశక్తి -అనంతపురం ప్రతినిధి :రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.లక్ష కోట్ల నిధులను కేంద్రం కేటాయించాలని ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. 'జిల్లా సమగ్రాభివృద్ధిాప్రత్యామ్నాయ విధానాలు' అన్న అంశంపై అనంతపురం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేడియెంట్ ఫంక్షన్ హాలులో సదస్సు నిర్వహించారు. 'వ్యవసాయాంనీటిపారుదల, పరిశ్రమలుాఉపాధి, సామాజిక తరగతులుా అభివృద్ధి ఆటంకాలు, విద్యాావైద్యం' అంశాలపై సదస్సు జరిగింది. ఒక్కో అంశానికి సంబంధించి ఆయా రంగంల్లో అనుభవమున్న వారు ప్రసంగించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమెల్సీ డాక్టర్ గేయానంద్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు ప్రారంభోపన్యాసం చేశారు. అభివృద్ధి అన్న పదానికి ప్రభుత్వాలు అర్థాలనే మార్చేస్తున్నాయని విమర్శించారు. తలసరి ఆదాయన్ని చూపించి అదే అభివృద్ధి అని చెబుతున్నాయన్నారు. ఆ రకమైన ఆర్థికాభివృద్ధి చూసినప్పుడు అది ధనవంతులు, పెట్టుబడిదారుల అభివృద్ధిగానే ఉంటోందని వివరించారు. ఆర్థికాభివృద్ధితోపాటు, మానవాభివృద్ధి జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక 77వ స్థానంలో ఉండగా భారతదేశం 133వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రాభివృద్ధి మరింత కుంటుపడిందని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాలకు లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీనివ్వాలని డిమాండ్ చేశారు. సాగునీటి రంగంపై మావన హక్కుల వేదిక నాయకులు ఎస్‌ఎం.బాషా మాట్లాడుతూ.. అత్యల్ప వర్షపాతం కలిగిన అనంతపురం జిల్లాకు సాగు, తాగునీటి వనరులను తీసుకురావడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ, హంద్రీనీవా ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయంలో వస్తున్న మార్పులను సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ విశ్లేషించారు. 1990 దశకం నుంచి వేరుశనగ పంట ప్రధాన పంటగా జిల్లాలో మారిందన్నారు. ఇప్పుడు పండ్ల తోటల సాగు గణనీయంగా పెరుగుతోందని వివరించారు. మారుతున్న పంటల సరళికి అనుగుణంగా తగిన ప్రోత్సహకాలు లేవన్నారు. పరిశ్రమలుా ఉపాధి అంశంపై ప్రొఫెసర్ బావయ్య మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. జిల్లా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనకు అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలిపారు. వీటి పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో ముందుకు రావడం లేదన్నారు. సాంకేతిక రంగంలో ఉపాధి అవకాశాలు అన్న అంశంపై అసిస్టెంట్ ప్రొఫెసరు క్యాస్ట్రో కిరణ్ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఐటి రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, దీన్ని అందిపుచ్చుకోవడానికి ఇతర రంగాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన వారు కూడా ఐటి రంగంలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పూర్తి స్థాయి సాంకేతిక అందిపుచ్చుకోకుండా అడుగు పెట్టడం ద్వారా కొన్ని ఇబ్బందులూ ఎదుర్కొనే పరిస్థితులుంటున్నాయని తెలిపారు. సామాజిక తరగతులుాఅభివృద్ధిాఆటంకాలు అన్న అంశంపై ప్రజా పర్యవేక్షణ కమిటీ కన్వీనర్ సత్యబోస్, భానుజాలు మాట్లాడారు. వైద్యరంగంపై డాక్టర్ ప్రసూన మాట్లాడారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా కోరారు.