Oct 21,2023 12:52

కర్నాటక : ఎవరికైనా సమస్య వస్తే ఏదో ఒక రూపంలో తమ నిరసనను అధికారులకు తెలియజేస్తారు.. ఇంకొంతమంది వినూత్నంగా నిరసనలు తెలుపుతారు.. అదే... రైతన్నలకు కోపమొస్తే ... తగ్గేదేలే..! ఆ నిరసనకు అధికారుల గుండెలు గుభేలనాల్సిందే..! అలాంటి ఘటనే విజయపూర్‌ జిల్లాలో జరిగింది..

22


పూర్తి వివరాల్లోకెళితే ... విజయపూర్‌ జిల్లా కొల్హార తాలూకా రోనిహాల్‌ గ్రామంలో సకాలంలో కరెంటు సరఫరా కావడం లేదు. రాత్రిళ్లు మాత్రమే కరెంటు వస్తుంది. దీంతో కర్నాటక అన్నదాతలు రాత్రిళ్లు పొలాల్లోకి వెళ్లి నీరు పెట్టడానికి నరకయాతన పడ్డారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పుకున్నా ... వారి సమస్యను పట్టించుకున్న నాథుడే లేదు. చిమ్మచీకట్లో పొలాల్లో ప్రాణాలను పంటిబిగువున పెట్టుకొని రైతన్నలు కష్టపడుతుంటే... మొసలి కనిపించింది. అప్పటికే తమ బాధను అధికారులకు చెప్పి.. చెప్పి... విసిగిపోయిన రైతన్నల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆ మొసలిని పట్టి హెస్కామ్‌ సబ్‌ స్టేషన్‌ యూనిట్‌ ఆవరణలోకి తీసుకొచ్చి పడేశారు. చీకట్లో పొలాలకు నీరెలా పెట్టేది ? అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిళ్లు జలచరాల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. వారికి కూడా ఇలాంటివి గుర్తు చేసేందుకు ఇలా చేశామని రైతన్నలు వాపోయారు. రాత్రిపూట కరెంటు ఇస్తే ఏం లాభం ? '' మా సమస్యను అధికారులు అర్థం చేసుకునేందుకే మొసలిని తీసుకొచ్చాం '' అన్నారు. రైతుల భూములకు పగటిపూట త్రీఫేజ్‌ విద్యుత్‌ అందడం లేదు. పగటిపూట త్రీఫేజ్‌ కరెంటు లేక నానా అవస్థలు పడుతున్న రైతన్నలు నిద్రలేచి అర్థరాత్రి నీళ్ల కోసం పొలాలకు పోవాల్సి వస్తుంది. గత రాత్రి పొలంలో తిరుగుతుండగా మొసలి కనిపించడంతో పట్టుకుని ట్రాక్టర్‌ ద్వారా విద్యుత్తు పంపిణీ కేంద్రానికి తీసుకొచ్చారు. చివరకు అటవీశాఖ అధికారులు రైతులను ఒప్పించి ఆ మొసలిని తీసుకెళ్లారు. మరి ఆ అధికారులు ఇప్పుడైనా సకాలానికి కరెంటును సరఫరా చేస్తారో.. లేదో... చూడాలి..!