కలెక్టరేట్‌కు ధాన్యాన్ని తరలించిన అన్నదాతలు
ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మద్దతు
ఆర్‌డిఒ జోక్యంతో మిల్లులకు తరలింపు
ప్రజాశక్తి - అమలాపురం (డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా) :ధాన్యం కొనుగోలు చేయాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం రూరల్, అయినవిల్లికి చెందిన రైతులు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ట్రాక్టర్లతో ధాన్యం లోడును కలెక్టరేట్ వద్దకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం సేకరణ లక్ష్యాలు పూర్తికావడంతో కొనుగోలు కేంద్రాలను మూసేశారని అన్నారు. దీంతో కొనేవారు లేక కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోయిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రబీకి సన్నద్ధమవ్వాలంటూ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ధాన్యం అమ్మకపోతే పెట్టుబడులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. వ్యాపారుల వద్ద పెట్టుబడులు పెట్టి ధాన్యం పండించామని, ఇప్పుడు కొనకపోతే ఆ అప్పులు ఎలా తీర్చాలంటూ వాపోయారు. విషయం తెలుసుకున్న పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని కనీసం వ్యాపారులకు అమ్ముకుందామన్నా ఆర్‌బికె సిబ్బంది సంచులను సైతం ఇవ్వట్లేదన్నారు. అమలాపురం రూరల్‌లోని ఎ వేమవర్పాడులో 800 క్వింటాళ్ల వరకూ ధాన్యం ఇంకా కళ్లాల్లోనే ఉందని తెలిపారు. ఖరీఫ్ ధాన్యం అమ్ముడుకాక, దాళ్వాకు పెట్టుబడి పెట్టలేక రైతులు అందోళన చెందుతున్నారన్నారు. అనంతరం ఆయన కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రైతులకు గోనె సంచులు సరఫరా చేసి కళ్లాల నుంచే ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆర్‌డిఒ వసంతరాయుడు రైతులతో మాట్లాడి ధాన్యం లోడు ట్రాక్టర్లను మిల్లులకు తరలించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.










