Jun 24,2023 18:11

చెన్నై : ఈ ఏడాది ఏప్రిల్‌లో తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన భూసమీకరణ చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడు రైతులు గురువారం నిరసనలు చేపట్టారు. కొత్త ప్రాజెక్టుల పేర భూసమీకరణ చేయాలని స్టాలిన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ చెన్నైలోని ఎగ్మోర్‌లోని రాజరథినం స్టేడియం సమీపంలో తమిళనాడు విశ్వాసాయిగం సంఘం (ఎఐకెఎస్‌) ఆధ్వర్యాన గురువారం రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో దాదాపు ఐదు వందల మందికి పైగా రైతులు పాల్గొన్నారు. ఈ నిరసనల్లో రైతులు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. ఈ చట్టం కార్పొరేట్‌ అనుకూలమైన, ప్రజావ్యతిరేకమైనదని రైతులు నినాదాలు చేశారు.
కాగా, ఈ నిరసన ప్రదర్శనల్లో మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ డి హరిపరంధామన్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఈ ఏడాది ఏప్రిల్‌ 21వ తేదీన రెండు చట్టాలను తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. అందులో ఒకటి ఫ్యాక్టరీ చట్టంలో సరవణలు చేసి పనిగంటల పెంపుదల చేస్తూ చట్టం అమోదించింది. అలాగే రైతుల భూములను స్వాధీనం చేసుకునే భూసమీకరణ చట్టాన్ని ఆమోదించింది. ప్రజల ఒత్తిడితో ఫ్యాక్టరీ పనిగంటల పెంపు చట్టాన్ని ప్రభుత్వం మే 1వ తేదీన ఉపసంహరించుకుంది. కానీ ఇంకా భూసమీకరణ చట్టం మాత్రం అమలులో ఉంది. భూసమీకరణ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాలకు పైగా భూమిని ఎలాంటి షరతులు లేకుండా ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్‌ విదేశాలకు వెళ్లి మా భూమిని సేకరించమని ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించారు. ఇప్పటికే చెన్నైలో కట్టుపల్లి పోర్టు కోసం అదానీకి నాలుగు వేల ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. ఈవిధమైన చర్యల ద్వారానే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తుందటే.. అలాంటి పురోగతిని మేము కోరుకోము.' అని జస్టిస్‌ హరిపరంథామన్‌ అన్నారు. ఇక తమిళనాడు ఎఐకెఎస్‌ అధ్యక్షుడు పి షణ్ముగం మాట్లాడుతూ.. 'ఈ భూ సమీకరణ చట్టాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేంతవరకు మేము పోరాడాలని నిర్ణయించుకున్నాము. ఫ్యాక్టరీ సరవణ చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లే ఈ భూ సమీకరణ చట్టం యొక్క ప్రభావాన్ని గ్రహించి దాన్ని తిప్పికొట్టడానికి చర్యలు తీసుకోవాలని మేము ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కోరుతున్నాము.
ఇక తమిళనాడు ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శులు సమీ నటరాజన్‌, పీఎస్‌ మసిలామణిలు ఈ చట్టానికి వ్యతిరేకంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. 'గత అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి చర్చ లేకుండా తమిళనాడు ప్రభుత్వం 17 బిల్లులను ఆమోదించింది. ఇందులో అతిముఖ్యమైనది భూ సమీకరణ చట్టం కూడా ఉన్నది. ఈ చట్టం ద్వారా ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ప్రవైట్‌ వ్యక్తులకు నీటి వనరులు, జలమార్గాలతో సహా వంద హెక్టార్లను భూమిని కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక చట్టాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టుల కోసం రైతుల నుండి భూమిని సేకరిస్తున్నప్పుడు వారికి న్యాయపరమైన పరిహారం పొందడానికే రైతులు పోరాడాలి. అలాంటి ఈ చట్టాన్ని ఎఐకెఎస్‌ వ్యతిరేకిస్తుంది' అని ప్రకటన పేర్కొంది. అలాగే 'ఈ చట్టం పేద, చిన్న, మధ్యతరహా రైతుల భూములను రక్షించడంలో సహాయపడదు. అలాగే నీటి వనరులను ఈ చట్టం రక్షించదు. ఈ చట్టం కేవలం కార్పొరేట్‌ సంస్థల కోసం, పారిశ్రామికాభివృద్ధి పేరుతో నీటి వనరులను నాశనం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని ప్రభుత్వం గ్రహించాలి' అని ఎఐకెఎస్‌ ప్రకటన ్పఏర్కొంది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని మే 17వ తేదీన ఎఐకెఎస్‌ ఆధ్వర్యంలో రైతులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. రైతుల నిరసనలపై స్టాలిన్‌ ప్రభుత్వం స్పందించలేదు.