హాంగ్‌జౌ : హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ పతకాల పంట కొనసాగుతోంది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మను బాకర్, రిథమ్ సాంగ్వాన్, ఈషా సింగ్‌లతో కూడిన మహిళల జట్టు గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నది. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ సింగిల్స్ పోటీల్లో సిఫ్ట్ కౌర్ సమ్రా స్వర్ణ పతకం గెలిచింది. భారత షూటింగ్ త్రయం సిఫ్ట్‌కౌర్ సమ్రా, మనిని కౌశిక్, ఆషి చోక్సీ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు రజతం దక్కింది. అదే సమయంలో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల అర్హతలో సిఫ్ట్‌కౌర్ రెండవ స్థానంలో, చోక్సీ ఆరో స్థానంలో నిలిచారు. నాలుగో రోజు పతకాలు కలుపుకుని భారత్ పతకాల సంఖ్య 16కు చేరింది. భారత క్రీడాకారులు ఇప్పటివరకు నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్యాలు సాధించారు.
చైనా జట్టుకు స్వర్ణ పతకం...
బుధవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ విభాగంలో చైనా జట్టు స్వర్ణ పతకం సాధించింది. చైనా 1773 పాయింట్లు సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. చైనా కంటే 9 పాయింట్లు వెనుకబడిన భారత జట్టు 1764 స్కోరుతో రజతం సాధించింది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా 1756 స్కోరు సాధించి.. మూడో స్థానములో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది.










