Apr 04,2023 21:30

2023-24 అంచనాల్లో ప్రపంచ బ్యాంక్‌ కోత
న్యూఢిల్లీ : భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 6.3 శాతం మాత్రమే ఉండొచ్చని ప్రపంచబ్యాంకు విశ్లేషించింది. గతంలో 6.6 శాతంగా అంచనా వేసింది. ప్రయివేటు వినిమయంలో పతనం, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలు జిడిపి మందగించడానికి ప్రధాన కారణాలని పేర్కొంది. రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం, ఆదాయాల్లో పెరుగుదల మందగించడం, ప్రయివేటు వినిమయం పడిపోవడం తదితర అంశాలు వృద్ధి రేటును ఒత్తిడికి గురి చేస్తున్నాయని తెలిపింది. కరోనా కాలంలో ప్రకటించిన ఆర్థిక మద్దతు ఉపసంహరించుకోవడం, ప్రభుత్వ వ్యయాల్లోను పెరుగుదల లేకపోవడం వృద్ధిని మందగించేలా చేస్తున్నాయని పేర్కొంది. 2024-26 మధ్య 7 శాతం సగటు వృద్ధి ఉండొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి ఉండొచ్చని ఆర్థిక సర్వే, 6.4 శాతం నమోదు కావొచ్చని ఆర్‌బిఐ, ఏసియన్‌ డెవెలప్‌మెంట్‌ బ్యాంకు, ఆరు శాతమే ఉండొచ్చని ఎస్‌అండ్‌పి గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థ అంచనా వేశాయి.