
2023-24లో ఆర్థిక శాఖ అంచనా
గతేడాదితో పోల్చితే పతనం
న్యూఢిల్లీ : భారత వృద్థి రేటు భళా అని.. దేశం దూసుకుపోతోందని పదే పదే చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వ వర్గాల వ్యాఖ్యలకు భిన్నంగా ఆర్థిక గణంకాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాదికేడాదికి జిడిపి పతనమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి 6.5 శాతానికి పరిమితమై.. వృద్థి మరింత పడిపోయే అవకాశముందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది వర్షాభావంతో ఖరీఫ్, రబీ కాలంలో పంటల దిగుబడుల్లో తగ్గుదల ఉండొచ్చని.. చమురు ధరల పెరుగుదల వృద్థిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్థిక శాఖ తన సమీక్షాలో పేర్కొంది.
ఇంతక్రితం 2022-23లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 7.2 శాతంగా నమోదయ్యింది. 2021-22లో 9.1 శాతం వృద్థి చోటు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం ఉత్పత్తుల విలువ పెరుగుదల 1.3 శాతానికి పరిమితమయ్యింది. ఇంతక్రితం ఏడాది ఈ రంగం ఏకంగా 11.1 శాతం వృద్థిని కనబర్చింది. ప్రజల కొనుగోలు శక్తికి కోలమానం అయినా తయారీ రంగం పేలవ ప్రదర్శన కనబర్చడం ఆర్థిక వ్యవస్థలోని బలహీనతలకు నిదర్శనం. ఈ ఏడాది కూడా తయారీ రంగం బలహీనంగా చోటు చేసుకునే అవకాశాలున్నాయి.
''ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయివేటు రంగ పెట్టుబడుల్లో తగ్గుదల చోటు చేసుకోవచ్చు. బ్యాంక్‌ల రుణాల జారీ, నిర్మాణ రంగంలో పెద్ద పురోగతి ఉండకపోవచ్చు. వర్షాభావం వల్ల పలు ఉత్పత్తుల ధరలు పెరిగి.. ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయి. అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో స్టాక్ మార్కెట్లు దిద్దుబాటుకు గురైయ్యే అవకాశాలున్నాయి. బ్యాంకింగ్ రంగంలో మాత్రం మొండి బాకీలు తగ్గి.. లాభాదాయకతలో మెరుగుదలను ప్రదర్శిస్తున్నాయి.'' అని ఆర్థిక శాఖ రిపోర్ట్‌లో పేర్కొంది. దేశంలో భారీగా పెరిగిన ధరలు ప్రజల ఆదాయాలు, పొదుపును దెబ్బతీస్తున్నాయి. ఇది తయారీ, ఇతర రంగాల డిమాండ్‌ను ప్రభావితం చేస్తున్నాయి. దేశం పురోగమించాలంటే పెట్టుబడులు కీలకం. కానీ.. ప్రజల వద్ద ఆదాయలు తగ్గడంతో వస్తువులకు డిమాండ్ పడిపోవడం.. ఆ ప్రభావం పారిశ్రామిక రంగంపై పడటంతో పెట్టుబడులు మందగిస్తున్నాయి. దీంతో వృద్థి రేటు తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.